
రోగి లేని అంబులెన్స్‌ను పంపి.. నీచ రాజకీయాలు
వేలూరు: అన్నాడీఎంకే కార్యకర్తలను బెదిరించేందుకే రోగి లేని అంబులెన్స్‌లను తమ ప్రచార సభలోకి పంపారని ప్రతిపక్ష నేత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలో సోమవారం రాత్రి ప్రచార సభ నిర్వహించారు. ఆ సమయంలో 108 అంబులెన్స్ వాహనం కార్యకర్తల మధ్యలో అతి వేగంగా వచ్చి ఎడపాడి మాట్లాడుతున్న పక్కనే వెళ్లింది. ఆ సమయంలో ఎడపాడి మాట్లాడుతూ డీఎంకే ఉద్దేశ పూర్వకంగానే తాను చేస్తున్న ప్రచార సభలోకి అంబులెన్స్‌లను పంపి అంతరాయం కలిగించాలని డీఎంకే నీచమైన రాజకీయాలు చేస్తోందని, ఎన్ని అంబులెన్స్‌లు పంపినా తమను ఏమీ చేయలేరన్నారు. తాను చేసిన 30 ప్రచార సభలోను ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. మరొక ప్రచార సభలో అంబులెన్స్ వస్తే వాటిని నడిపే డ్రైవరే అందులో రోగిగా వెళ్తారని అన్నారు. ప్రతి పక్ష పార్టీలకు చెందిన సమావేశాలకు పోలీసులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనకట్టు నియోజక వర్గం అన్నాడీఎంకే కోటగా ఉందన్నారు. ప్రస్తుతం పంపిన అంబులెన్స్‌లో రోగులు ఎవరూ లేదని అయినప్పటికీ రోగిని తీసుకొచ్చే విధంగానే వెళ్తుందన్నారు. గత ఐదు సంత్సరాల కాలంలో డీఎంకే ప్రజలకు ఎటువంటి పథకాలు కల్పించలేదన్నారు. తాము ప్రవేశ పెట్టిన పథకాలను పూర్తిగా నిలిపి వేశారని అయినప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కొనసాగిస్తామన్నారు. కరోనా కాలంలోనూ తాము ఎటువంటి ధరలు పెంచకుండా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అంబులెన్స్ డ్రైవర్‌పై దాడికి దిగిన కార్యకర్తలు: ప్రచార సభసమయంలో వచ్చిన 108 అంబులెన్స్ డ్రైవర్‌పై కార్యకర్తలు దాడికి దిగారు. ఆ సమయంలో అంబులెన్స్‌లో రోగులు లేనప్పటికీ కావాలనే ఎందుకు తీసుకొచ్చారని నిలదీశారు. అనంతరం అతని గుర్తింపు కార్డును తీసి పరిశీలించినట్లు తెలిసింది.
డ్రైవర్‌ను బెదిరించడం సరికాదు: మంత్రి సుబ్రమణియన్
వేలూరు జిల్లా అనకట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అడుక్కంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోగిని తీసుకెళ్లేందుకు అత్యవసరంగా వెలుతున్న అంబులెన్స్ డ్రైవర్‌ను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ చైన్నెలో విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.