
టీఆర్ బాలుకు సతీవియోగం
సాక్షి, చైన్నె : డీఎంకే కోశాధికారి, సీనియర్ ఎంపీ టీఆర్‌బాలు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజ తల్లి రేణుకా దేవి (79) చైన్నెలో మంగళవారం కన్నుమూశారు. ఈ సమాచారంతో టీఆర్ బాలు నివాసానికి సీఎం స్టాలిన్ చేరుకుని రేణుకాదేవి పార్తీవ దేహానికి నివాళులర్పించారు. ఇది వరకు డీఎంకే పార్లమెంటరీ నేతగా, ప్రస్తుతం డీఎంకే కోశాధికారిగా , సీనియర్ ఎంపీగా అందరికి టీఆర్‌బాలు సుపరిచితులు. ఆయనకు రాజకీయంగానే కాకుండా, కుటుంబ పరంగా సతీమణి రేణుకాదేవి అండగా ఉండే వారు. ఈ దంపతుల తనయుడే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా టీఆర్‌బీ రాజ వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా రేణుకాదేవి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ వచ్చారు. చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స పొందుతూ వచ్చిన ఆమె మంగళవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. ఆమె భౌతికకాయాన్ని టీ నగర్‌లోని నివాసానికి తరలించారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, డీఎంకే వర్గాలు, పలువురు మంత్రులు టీనగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఆమె పార్తీవ దేహానికి నివాళుర్పించారు. టీఆర్‌బాలును, రాజను సీఎం స్టాలిన్ ఓదార్చారు. టీఆర్‌బాలుకు తోడు నీడగా ఉంటూ వచ్చిన రేణుకాదేవి సేవను గుర్తుచేస్తూ నివాళుర్పించారు.