
● కోయంబేడు – పట్టాభిరాం మధ్య సేవలు ●తొలి విడతగారూ. 2,44
మెట్రో విస్తరణకు ఆమోదం
సాక్షి, చైన్నె: కోయంబేడు నుంచి ఆవడి మీదుగా పట్టాభిరాం వరకు మెట్రో రైలు సేవలకు సంబంధించిన సమగ్రనివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో పనులకు రూ. 2,442 కోట్లు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులను అధికారులు జారీ చేశారు. వివరాలు.. చైన్నెలో ప్రస్తుతం విమానాశ్రయం నుంచి ఆలందూరు – కోయంబేడు మీదుగా సెంట్రల్‌కు, సెయింట్ తామస్ మౌంట్ నుంచి ఆలందూరు – అన్నా సాలై మీదుగా విమ్కో నగర్‌కు మెట్రో రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఈ మార్గాలలో సుమారు మూడు లక్షల మంది వరకు రైలు సేవలను పొందుతున్నారు. అలాగే, ఫేజ్ 2 లో 119 కి.మీ దూరం మాదవరం – సిరుచ్చేరి, మాదవరం – షోళింగనల్లూరు, పూందమల్లి – లైట్ హౌస్ మధ్య మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ 2028లో ముగించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. అదే సమయంలో చైన్నె విమానాశ్రయం నుంచి కిలాంబాక్కం వరకు, కోయంబేడు నుంచి ఆవడి మీదుగా పట్టాభిరాం వరకు, పూందమల్లి నుంచి పరందూరు వరకు రైలు సేవలను పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా ప్రకటన కూడాచేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో యాజమాన్యం రూపకల్పన చేస్తూ వస్తోంది. ఇందులో కోయంబేడు నుంచి పట్టాభిరాం వరకు సుమారు 22 కి.మీ దూరం మెట్రో పనులకు కార్యాచరణ సిద్ధంచేశారు. కోయంబేడు నుంచి తిరుమంగళం – మొగపేర్ మీదుగా పాడి, అంబత్తూరు, తిరుముల్‌లై వాయిల్, ఆవడి మీదుగా పట్టాభిరాం వరకు పనులకు నిర్ణయించారు. అంబత్తూరు ఎస్టేట్, ఆవడి బస్టాండ్, రైల్వే స్టేషన్‌లతో పాటూ ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానించే విధంగా పనులకు సంబంధించిన నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో పాటూ తొలి విడత పనులకు రూ. 2,442 కోట్లు కేటాయించింది. త్వరంలో ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు మొదలు కాగానే, పూందమల్లి – పరందూరు, విమానాశ్రయం – కిలాంబాక్కం పనులకు ఆమోద ముద్ర వేయబోతున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.