
రవాణా ఉద్యోగులకు రూ. 1,137 కోట్ల కేటాయింపు
ఉత్తర్వుల జారీ
సాక్షి, చైన్నె :రవాణా ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా రూ.1,137 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి.2023, 2024లో పదవీ విరమణ చేసిన వారికి ఈ మొత్తాన్ని వర్తింప చేశారు. వివరాలు.. రాష్ట్రంలో వివిధ డివిజన్లుగా రవాణా సేవలు సాగుతున్న విషయం తెలిసిందే. సుమారు లక్షన్నర మంది ఈ శాఖలో పనిచేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన నినాదంతో తరచూ ఆందోళనలు చేస్తూవస్తున్నారు. సమ్మే గంటకు సిద్ధమైనప్పుడల్లా వీరితో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరపడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితులో కార్మికుల విజ్ఞప్తులకు అనుగుణంగా వారికి పదవీ విరమణ సహా తక్షణ ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. 2023లో రవాణా రంగం నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు యోజనాల నిమిత్తం రూ.265 కోట్లు, 2024 ఏప్రిల్‌నుంచి 2025 జనవరి వరకు కాంట్రిబ్యూటరి రిటైర్మంట్ పథకం కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నగదు ప్రయోజనాల చెల్లింపునకు రూ. 40 కోట్లు , 2023 నుంచి 2025 వరకు పదవీ విరమణ చేసిన వారి ప్రయోజనాల నిమిత్తం రూ. 2,450 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక చేరింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 2023–2024 సంవత్సరానికి గాను తొలి విడతగా రూ. 1,137 కోట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ, ఆయా డివిజన్లకు కేటాయించాల్సిన నిధుల సమగ్ర వివరాలను ప్రకటించారు.