
పరిశోధనా విద్యకు అధిక ప్రాధాన్యమివ్వాలి
వేలూరు: విద్యార్థులు పరిశోధన విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా సేర్‌కాడులోని తిరువళ్లువర్ యూనివర్సిటీ పరిధిలో వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట, కళ్లకుర్చి, విల్లుపురం జిల్లాల్లో మొత్తం 83 డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు నడుస్తోంది. వీటిలో మొత్తం ఒక లక్ష 13,275 మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరిధిలో 20వ స్నాతికోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కోర్సుల్లో డిగ్రీలు సాధించిన 256 మంది విద్యార్థినీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బెంగుళూరు ఎంఎస్ రామయ్య యూనివర్శిటీ ఆఫ్ అప్లేడ్ సైన్స్ వైస్ చాన్స్‌లర్ కుల్దీప్ కుమార్ రైనా మాట్లాడుతూ విద్యను అభ్యసించడంతో పాటూ పలు పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి దోహద పడాలన్నారు. ప్రతి విద్యార్థికి జీవితంలో లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు కష్టపడి ప్రయత్నం చేయాలన్నారు. ఇండియా ఇతర దేశాలకంటే అధికంగా పరిశ్రమలను స్థాపించి మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆరుముగం, రిజిస్టార్ సెంథిల్ వేల్‌మురుగన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ వేలూరు రాకతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా వేలూరుకు వచ్చిన గవర్నర్‌కు కలెక్టర్ సుబ్బలక్ష్మి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.