
వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు
వేలూరు: వేలూరు కార్పొరేషన్‌లోని 60 వార్డుల్లోని 32 వేల వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేయనున్నట్లు మేయర్ సుజాత అన్నారు. మంగళవారం ఉదయం వేలూరు పాలారు సమీపంలోని వెటర్నరీ వైద్యులతో ఈ ఆపరేషన్‌లను ఎమ్మెల్యే కార్తికేయన్ ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్ పరిధిలోని వీధి కుక్కలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతోపాటు కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాఽధి మనిషికి సోకి వెంటనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో కార్పొరేషన్ పూర్తిగా వీధి కుక్కలకు గత మే మాసంలో పిచ్చికుక్కలకు ఇంజెక్షన్‌లు వేశారన్నారు. ప్రస్తుతం వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో వీటిని ప్రారంభించామన్నారు. ఆపరేషన్‌లను వేలూరు కార్పొరేషన్, వెటర్నరీ, తిరిచ్చికి చెందిన ప్రయివేటు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చేయనున్నట్లు తెలిపారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 32 వేల వీధి కుక్కలు, గ్రామీణ ప్రాంతాల్లో 15 వేలకు పైగా వీధి కుక్కలున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఆపరేషన్‌లను కార్పొరేషన్‌లోని మొత్తం 60 వార్డుల్లోను ఆయా ప్రాంతాలకు వెటర్నరీ డాక్టర్లు వెళ్లి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు స్థానికులు సహకరించాలన్నారు. పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ తిరుకుమరన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.