
ఇది సాధ్యమేనా..?
తమిళసినిమా: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కించిన కూలీ చిత్రం ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంతకుముందు కమలహాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రం సాధించింది. ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం చేయడానికి లోకేష్ కనకరాజ్ సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. కమలహాసన్ రజనీకాంత్ చిరకాల మిత్రులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీరిద్దరూ కలిసి 1975లో అపూర్వ రాగంగళ్ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో మొత్తం 21 చిత్రాలను కలిసి చేశారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి చివరిగా 1979లో అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కొందరు దర్శకులు వీరి కాంబోలో చిత్రం చేయాలని ప్రయత్నించినా, అది కార్యరూపం దాల్చలేదు. అలాంటిది సుమారు 46 ఏళ్ల తర్వాత కమలహాసన్, రజనీకాంత్‌ను ఓకే చిత్రంలో నటింపజేయడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం. ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈయన విక్రమ్ చిత్రానికి ముందే తన బ్యానర్లో రజనీకాంత్ తో కలిసి చిత్రం చేయడానికి ప్రయత్నించారనీ, అయితే అది సెట్ కాలేదని ప్రచారం జరిగింది. తాజాగా ఇద్దరు ఓల్డ్ గ్యాంగర్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రంలో కమలహాసన్, రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
రజనీకాంత్, కమలహాసన్, లోకేష్ కనకరాజ్