
పుట్టిన బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యకరం
వేలూరు: పురిటి బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడమే తల్లులకు అందమని పల్లిగొండ రోటరీ అసోసియేషన్ సభ్యులు జోసెఫ్ అన్నయ్య అన్నారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవ వారోత్సవాల్లో బాగంగా వేలూరు జిల్లా పల్లిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డ తల్లులకు పల్లిగొండ రోటరీ అసోసియేషన్ అద్యర్యంలో కిట్లు పంపిణీ కార్యక్రమం సంఘం అధ్యక్షులు సుందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి వారి పిల్లలకు ఆరు నెలల వరకై నా తల్లిపాలను ఇవ్వాలని డాక్టర్‌లు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లి పాలతోనే చిన్నారులకు మంచి పౌష్టిక శక్తితో పాటు ఆరోగ్యంగానూ ఉంటారన్నారు. ప్రస్తుత కాలంలో పురుషులతో పాటూ మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్లడంతో చిన్నారులకు తల్లి పాలను ఇవ్వడంలో కాస్త ఇబ్బందులున్నాయన్నారు. అదేవిధంగా కొంత మంది తల్లులు తల్లి పాలు ఇవ్వడం ద్వారా అందం చెడిపోతుందని పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, అటువంటి భ్రమలన్నీ వదిలి పెట్టాలన్నారు. తల్లి పాలలో ఎంతో శ్రేయష్కరం ఉంటుందన్నారు. దేశంలో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య తగ్గుతూ వస్తుందని వీటిపై గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్ బాలచందర్ మాట్లాడుతూ పుట్టిన అర్ధగంటలోనే తల్లి ముర్రుపాలను ఇవ్వడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్ కుమరగురు, అసోసియేషన్ కార్యదర్శి అక్బర్, కోశాధికారి కోవేందన్, ఉపాధ్యక్షులు చక్రవర్తి, జయసింహన్ పాల్గొన్నారు.