
10 అడుగులకు మించి విగ్రహాలు పెట్టొద్దు
వేలూరు: అనుమతి లేని ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించరాదని కలెక్టర్ సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. వేలూరులో ఈనెల 27న జరగనున్న వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ట, ఊరేగింపుపై హిందూ మున్నని, పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈనెల 27న పండుగ జరుపుకుంటారని అయితే అనుమతి పొందిన ప్రాంతాల్లో మాత్రమే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేపట్టాలన్నారు. అదే విధంగా పది అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్టించేందుకు అనుమతి ఇవ్వరాదన్నారు. మూడవ రోజున విమగ్నానికి వేలూరు కార్పొరేషన్ పరిధిలో 508 విగ్రహాలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టిస్తే పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు కుదరదని, సొంత పూచీకత్తుపై విగ్రహాలు ఏర్పాటు చేస్తే అందుకు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉదయం ఊరేగింపును ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయాలని ట్రాఫిక్‌కు ఎట్టి పరిస్థితుల్లోను ఆటంకం కల్పించరాదన్నారు. వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారుల వద్ద అనమతి పొందాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే విధంగా ఏర్పాటు చేయరాదన్నారు. ఇతర మతస్తుల ప్రార్థనా స్థలం వద్ద విగ్రహాలు ఏర్పాటు చేయరాదన్నారు. సమావేశంలో ఎస్పీ మయిల్‌వాగనం, డీఆర్‌ఓ మాలతి, జిల్లాలోని రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటూ హిందూ మున్నని కార్యకర్తలు పాల్గొన్నారు.