
తలైవన్ తలైవి సక్సెస్ మీట్
తమిళసినిమా: తలైవన్ తలైవి చిత్ర విజయోత్సవాన్ని యూనిట్ సభ్యులు వేడుకగా జరుపుకున్నారు. నటుడు విజయ్‌సేతుపతి,నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఇది. పాండిరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సత్యత్యోతి ఫిలింస్ పతాకంపై టీజీ.త్యాగరాజన్ సమర్పణలో అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత నెల 22న విడుదలై ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని అందుకుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్తాపాలు, విడిపోవడాలు వివాహ రద్దుకు పరిష్కారం కాదనే చక్కని సందేశంతో వినోదభరితంగా రూపొందిన చిత్రం తలైవన్ తలైవి. ఇది నటుడు విజయ్ సేతుపతి నటించిన 52వ చిత్రం కావడం గమనార్హం. కాగా ఈ చిత్ర విజయోత్సవ వేడుకలను ఇటీవల చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్‌లో యూనిట్ సభ్యులు జరుపుకున్నారు. దర్శకుడు, ఫెఫ్సీ అద్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, తమిళ్ దర్శకుల సంఘం అద్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.