
ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ
తిరువళ్లూరు: ఎయిడ్స్ రహిత దేశాన్ని నిర్మించాలన్న బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ ఎయిడ్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన ర్యాలీని నిర్వహించాలని తమిళనాడు ఆరోగ్యశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజాజీవీధి, మాడవీధి, బజారువీధుల్లో సాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఎయిడ్స్‌ను వందశాతం నిర్మూలించడానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ ఎయిడ్స్ భాదితులను దూరంగా పెట్డడం, వారిపై చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్న కలెక్టర్ వారితో సోదర భావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియరాజ్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ భవ్య దివ్యదర్శిని, జిల్లా ఐసీటీసీ బబిత ఎయిడ్స్ నివారణ యూనిట్ సిబ్బందితోపాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.