
తిరుత్తణిలో 210 టన్నుల చెత్త తొలగింపు
తిరుత్తణి: తిరుత్తణిలో ఆడికృత్తిక సందర్భంగా పట్టణ వ్యాప్తంగా పేరుకుపోయిన 210 టన్నుల చెత్తకుప్పలను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. విస్తృతంగా పరిశుభ్రత పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అశ్వినితో ప్రారంభమైన ఆడికృత్తిక వేడుకలు సోమవారం వరకు ఐదు రోజులపాటు నిర్వహించారు. పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామికి కావళ్లు చెల్లించి, దర్శించుకున్నారు. భక్తులు వేసిన చెత్తకుప్పలు పేరుకుపోకుండా పరిశుభ్రత పనుల్లో మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితోపాటు వివిధ మున్సిపాలిటీలు, టౌన్ పంచాయతీల నుంచి 140 మంది పాల్గొన్నారు. వేడుకలు జరిగిన ఐదు రోజులు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు చెత్తకుప్పలు తొలగించే పనులు చేపట్టారు. పట్టణ వ్యాప్తంగా చెత్త కుప్పలు పేరుకుపోకుండా శుభ్రం చేసి వాహనాల ద్వారా తరలించారు. అలాగే శరవణ పుష్కరిణితోపాటు ఎగువ తిరుత్తణి నల్లాన్ పుష్కరిణిలో భక్తులు వేసిన పుష్పాలు, పూజా సామగ్రిని తొలగించి వాహనాల్లో తరలించారు. పారిశుధ్య పనులు నిర్విరామంగా నిర్వహించి పరిశుభ్రతగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల కృషితో 210 టన్నుల చెత్తకుప్పలు తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచినట్లు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.