
ప్రసాద్ ల్యాబ్‌లో ముత్యాల ముగ్గు సినిమా ప్రదర్శన
– ఈ ఏడాదితో ముత్యాలముగ్గుకు 50 ఏళ్లు
కొరుక్కుపేట: శ్రీరామ చిత్ర పతాకంపై ఎంవీఎల్ నిర్మించిన ముత్యాల ముగ్గు సినిమాకి ఈ ఏడాదితో యాభై ఏళ్లు నిండాయి. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బాపునకు 92 ఏళ్లు, మాటలు అందించిన రమణకు 94 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బాపు, రమణ కుటుంబ సభ్యులు చైన్నెలోని ప్రసాద్ లాబ్‌లో అభిమానుల కోసం ముత్యాలముగ్గు సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనను సినిమా నేపథ్య గాయని పి.సుశీల, సీనియర్ నటి సుహాసిని, సంగీత దర్శకుడు సాలూరి వాసు రావు, ప్రముఖ హీరో భానుచందర్, తెలుగు ప్రముఖలు, వేదవిజ్ఞానవేదిక అధ్యక్షుడు జేకేరెడ్డి, తెలుగు భాషాభిమాని శోభారాజా, బాపు రమణ కుటుంబసభ్యులు, ఇంకా అభిమానులు పాల్గొని ముత్యాల ముగ్గు సినిమాను చూసి ఆనందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్యాల ముగ్గు సినిమా తెలుగు సినీ చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలిందన్నారు. బాపు దర్శకత్వం, ముళ్లపూడి వెంకటరమణ మాటలతో 1975లో విడుదలైన ముత్యాల ముగ్గు సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని నేపథ్య గాయని సుశీల పేర్కొన్నారు. ఈ సినిమాలోని అన్ని పాత్రలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయని, సామాజిక సమస్యలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికీ మరిచిపోలేని ముత్యాల ముగ్గు సినిమాను మరో సారి చూసి ఆనందించాలని బాపు–రమణ కుటుంబసభ్యులు కోరారు.