
మంత్రి పెరియ స్వామికి సుప్రీంలో ఊరట
– విడుదల రద్దు ఉత్తర్వులపై స్టే
సాక్షి,చైన్నె: డీఎంకే మంత్రి ఐ పెరియస్వామికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన విడుదలను రద్దు చేస్తూ హైకోర్టు బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డీఎంకే మంత్రులు దురై మురుగన్, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం తదుపరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ దృష్టిలో మంత్రి ఐ.పెరియస్వామి పడిన విషయం తెలిసిందే. . 2006–2010లో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి మంత్రి ఐ. పెరియ స్వామి ఆస్తులు గడించినట్టుగా గతంలో కేసు నమోదైంది. ఆయన సతీమణి సుశీల, కుమారులు ప్రభు, సెంథిల్‌కుమార్‌లను ఈకేసులో చేర్చారు. వీరిని దిండుగల్ కోర్టు కేసు నుంచి విడుదల చేసింది. అయితే, పునర్ సమీక్ష పిటిషన్ విచారణలో విడుదల తీర్పు రద్దు చేస్తూ న్యాయమూర్తి వేల్ మురుగన్ తీర్పు చెప్పారు. ఈ కేసును ఐ.పెరియస్వామి అండ్ ఫ్యామిలీ మళ్లీ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసును ఆరు నెలలో ముగించే విధంగా కింది కోర్టును న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ రద్దు తీర్పును వ్యతిరేకిస్తూ ఐ. పెరియస్వామి సుప్రీం కోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం హైకోర్టు జారీ చేసిన రద్దు ఉత్తర్వులకు మధ్యంతర స్టే విధించారు. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను దాఖలు చేయాలని తమిళనాడు అవినీతి నిరోధక శాఖను సుప్రీం కోర్టు బెంచ్ న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో ఈ కేసుల నుంచి తాత్కాలికంగామంత్రికి ఊరట కలిగినట్లయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా మనీ లాండరింగ్ అంటూ ఐ.పెరియస్వామిని ఈడీ టార్గెట్ చేసి శని, ఆదివారాలలో ఆయన నివాసాలలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే.