
విభేదాలన్నీ వీడితేనే దేశంలో ఐక్యత
సాక్షి, చైన్నె: కుల, మత బేధాలన్నింటినీ చిన్నాభిన్నం చేసినప్పుడే అందరం ఒకే దేశంలో ఐక్యంగా ముందుకెళ్లగలమని రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ అభిప్రాయపడ్డారు. వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ ఆదివారం 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కామరాజర్ అరంగంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తిరుమావళవన్‌కు కమలహాసన్ కేజీ బరువు కలిగిన వెండి చైన్‌ను బహూకరించారు. ఈసందర్భంగా కమల్ ప్రసంగిస్తూ, తిరుమావళవన్ 46 ఏళ్ల రాజకీయ ప్రస్తానం గురించి వివరించారు. రాజకీయాలలో రాణించడం సాధారణం కాదని, ఆయన ఒక పార్టీని 40 సంవత్సరాలకు పైగా నడిపిస్తుండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఒక పార్టీని నడిపించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని అని, ఇది ఒక పార్టీ నేతగా తనకు తెలుసునని వ్యాఖ్యలు చేశారు. తిరుమావళవన్ అద్బుతమైన వ్యక్తి అని, ఆయన్ను ఆదాయం కావాలా..? రాజకీయం కావాలా..? అని ప్రశ్నిస్తే, తనకు రాజకీయం కావాలని సమాధానం ఇచ్చే వ్యక్తి అని కొనియాడారు. తన కులం తనకు తొలి శతృవు అని అంటారని పేర్కొంటూ, కులం, మతం బేధాలన్నీ చిన్నా భిన్నమైనప్పుడే ఈ దేశంలో అందరం ఐక్యంగా ఉండగలమని వ్యాఖ్యలు చేశారు.