
ఊపందుకున్న గణపయ్యల తయారీ
తిరువళ్లూరు: వినాయకచవితి వేడుకలకు మరో పది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో వినాయకుడి విగ్రహాల తయారీ, ముందస్తు బుకింగ్ ఊపందుకుంది.ఈ ఏడాది కూడా వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ హిందూమున్ననీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిమల తయారీ ఊపందుకుంది. హిందు మున్ననీ నేతలు తిరుపతి, విల్లుపురం ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకొచ్చి పలు ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి విక్రయాలకు సిద్ధంగా వుంచారు. ప్రస్తుతం విక్రయాలకు సిద్ధంగా వున్న విగ్రహాలను ముందుగానే బుకింగ్ చేసుకునే పనిలో ఉత్సవ నిర్వాహకులు నిమగ్నమయ్యారు.పర్యావరణానికి ముప్పులేని, సులభంగా నీటిలో కరిగే ప్రతిమలను మాత్రమే విక్రయించాలని అధికారులు ఆదేశించారు. దీంతో బొమ్మల తయారీదారులు అధికారుల సూచన మేరకు బొమ్మలను తయారు చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. మూడు నుంచి పది అడుగుల మేరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీటి ధరలు వెయ్యి నుంచి రూ.20 వేల వరకు వుంటుందని హిందూ మున్ననీ అధ్యక్షుడు వినోద్‌కన్నా వివరించారు. ప్రస్తుతం రెండువందలకు పైగా విగ్రహాలు వున్నాయి. 30 రకాల ప్రతిమలను తయారు చేసి విక్రయాలకు సిద్ధంగా వుంచినట్టు హిందూ మున్ననీ నేతలు ప్రకటించారు.