పోక్సో కేసులో శిక్షపడిన యువకుడి విడుదల | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో శిక్షపడిన యువకుడి విడుదల

Aug 18 2025 6:09 AM | Updated on Aug 18 2025 6:09 AM

పోక్సో కేసులో శిక్షపడిన యువకుడి విడుదల

పోక్సో కేసులో శిక్షపడిన యువకుడి విడుదల

– మద్రాసు హైకోర్టు తీర్పు

కొరుక్కుపేట: యుక్తవయస్సు రావడానికి కేవలం 19 రోజుల దూరంలో ఉన్న కళాశాల విద్యార్థిని అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ అయిన యువకుడిని మద్రాస్‌ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వివరాలు.. కోయంబత్తూరుకు చెందిన ఓ యువకుడు కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అతడిని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ ఇద్దరూ లైంగిక చర్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు వీరి ప్రేమకు అంగీకరించలేదు. పైగా అప్పటికే వివాహం చేసుకున్న 40 ఏళ్ల బంధువుతో ఆమెకు వివాహం ఏర్పాటు చేశారు. అయిష్టత వ్యక్తం చేసిన ఆ విద్యార్థిని తన ప్రియుడి ఇంట్లో ఆశ్రయం పొందింది. దీని తరువాత, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. కేసును విచారించిన కోయంబత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి, ఆ యువకుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాస్‌ హైకోర్టులో అప్పీలు దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జి.కె. ఇలంధిరియన్‌, దిగువ తీర్పును కొట్టివేసి, యువకుడిని నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశించారు. ఆ సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతోనే జరిగిందని, బాధితురాలు కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నందున ఆమె తన చర్యల పర్యవసానాలను అర్థం చేసుకోగలదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ఘటన జరిగిన సమయంలో ఆ మహిళ మద్యం మత్తులో లేదని పేర్కొంది. అతను ఆ మహిళను అపహరించాడని, కిడ్నాప్‌ చేశాడని ఎటువంటి ఆధారాలు లేవు. విచారణ అంతటా విద్యార్థిని ఎక్కడా తన అనుమతి లేకుండా , ఒత్తిడితో లైంగిక సంబంధం జరిగిందని పేర్కొనలేదు. ఈనేపథ్యంలో అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement