
బీజేపీలోకి డీఎంకే నేతలు
సాక్షి, చైన్నె: బీజేపీలోకి డీఎంకే నుంచి పలువురు నేతలు వచ్చి చేరబోతున్నారని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్టు వివరించారు. కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ మురుగన్ ఆదివారం కోయంబేడులో మీడియాతోమాట్లాడారు. తమిళనాడుకు కేంద్ర అనేక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టు వివరించారు. తాజాగా ప్రజల విజ్ఞప్తి మేరకు అదనంగా రైళ్ల స్టాపేజికి సైతం అనుమతులు దక్కాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది తమిళనాడులో రైల్వే పథకాలకు కేంద్రం రూ. 6,626 కోట్లు కేటాయించిందన్నారు.
బీజేపీలోకి వలసలు..
డీఎంకే నేతలు కొందరు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వారు తమతో సంప్రదింపులు చేస్తున్నారని, త్వరలో వారు బీజేపీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. తమ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 22వ తేది తిరునల్వేలిలో పర్యటించనున్నారని తెలిపారు. ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని బూత్ కమిటీల నేతలతో ఆయన మాట్లాడుతారని వివరించారు. తమ కూటమిలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదన్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ఆయన యాత్రకు వస్తున్న స్పందనను చూస్తే తమ కూటమిలోకి చేరేందుకు మరిన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయన్నారు.