తెలుగు పాఠశాలలో చేరితే టేబుల్ ఫ్యాన్ ఉచితం
● గ్రామీణులను ఆకట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయుడు
పళ్ళిపట్టు: తెలుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు అత్తిమాంజేరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం భూపతి టేబుల్ ఫ్యాన్ ఉచితంగా పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆదేశించింది. దీంతో పళ్లిపట్టు మండలంలోని అత్తిమాంజేరి ప్రభుత్వ తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలుగు మీడియం పాఠశాలలో విద్యార్థులను చేర్పించే లక్ష్యంతో ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యా సామగ్రి అందజేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విద్య, ఉపాధిలో ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అలాగే తెలుగు మీడియంలో అడ్మిషన్లు పొందిన వారికి రూ.750 విలువైన టేబుల్ ఫ్యాన్ ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వేసవి సెలవులు తరువాత పాఠశాల తెరిచిన తొలిరోజు ఐదుగురు బాల, బాలికలు ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందారు. వారిని బడిలో చేర్పించుకున్న హెచ్‌ఎం భూపతి ప్రభుత్వ పాఠ్యప్తుకాలు, నోటు పుస్తకాలు, యూనిపామ్, బ్యాగ్, షూతోపాటు హెచ్‌ఎం నిధుల నుంచి టేబుల్ ఫ్యాన్ సైతం అందజేశారు.


