
రాందాసు, తనయుడు అన్బుమణి
చీలిక దిశగా పీఎంకేలో పరిణామాలు
తనయుడు అన్బుమణిపై రాందాసు తీవ్ర విమర్శలు
పార్టీని పతనం వైపు తీసుకెళ్లాడని మండిపాటు
ఆ ఇద్దరి ఒత్తిడితోనే బీజేపీ కూటమిలోకి..
సాక్షి, చైన్నె: పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సమరం తారాస్థాయికి చేరింది. పీఎంకేలో చీలిక తప్పదా అనే చర్చ ఊపందుకుంది. అన్బుమణిని గురి పెట్టి రాందాసు గురువారం తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చకు దారి తీసింది. తండ్రి, తనయుడు మధ్య సమరం పీఎంకేలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించినట్టైంది. పీఎంకేలో అధ్యక్ష పదవి వ్యవహారంలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. తానే అధ్యక్షుడిని అని రాందాసు, కాదుకాదు తానే అధ్యక్షుడిని అంటూ అన్బుమణి పరస్పరం కయ్యానికి కాలుదువ్వే రీతిలో వ్యవహరిస్తుండడం ఆ పార్టీలోని జిల్లాల నేతలను సందిగ్ధంలో పడేసింది. పార్టీ భవిష్యత్తు అన్బుమణిగా ఉన్నప్పటికీ, పార్టీ వ్యవస్థాపకుడిని వదులుకునే పరిస్థితుల్లో లేక అనేక మంది నేతలు సతమతం అవుతూ వస్తున్నారు. ఈనెల ఐదారురోజుల పాటు రాందాసు నేతృత్వంలో జరిగిన పార్టీ సమావేశాలకు సైతం అనేక మంది నేతలు దూరంగా ఉండడం గమనార్హం. తండ్రి, తనయుడి మధ్య తాము నలిగిపోవాల్సి వస్తున్నదే అన్న ఆవేదనను పలువురు నేతలు పరోక్షంగా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు ఈ వార్ తారాస్థాయికి చేర్చినట్టైంది. అన్బుమణి తన కుమారుడైనప్పటికీ, రాజకీయంగా సమర్థుడు కాదన్నట్టుగా రాందాసు తీవ్ర వ్యాఖ్యలను ఉపయోగించడం పెనుదుమారానికి దారి తీసింది.
రాందాసు తీవ్ర వ్యాఖ్యలు
దిండివనం సమీపంలోని తైలాపురం గెస్ట్‌హౌస్‌లో ఉదయం రాందాసు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ, రాజకీయ, కూటమి పరంగా అన్బుమణిని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. తొలుత కుటుంబంలోని పరిస్థితులను గుర్తు చేస్తూ, అన్బుమణిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో రాజ్య సభకు పంపించడమే కాకుండా, కేంద్రంలో ఆరోగ్యమంత్రి పదవి ఇప్పించి పెద్ద తప్పు చేసినట్టు వ్యాఖ్యలు చేశారు. అయిష్టంగానే పార్టీ పరంగాగానీ, పదవుల పరంగా గానీ అన్బుమణి విషయంలో తాను నిర్ణయాలు తీసుకుంటూ వచ్చానని వివరించారు. అన్బుమణి తప్పుమీద తప్పులు చేస్తూ వెళ్తున్నాడని వివరిస్తూ తీవ్రంగా మండిపడ్డారు.
తప్పుకుంటున్నా...
పీఎంకేలో వాస్తవానికి సమరం అన్నది తెరపైకి రావడం వెనుక తన కుమార్తె పెద్ద కుమారుడు, మనవడైన ముకుందన్‌కు యువజన ప్రధాన కార్యదర్శి పగ్గాలను రాందాసు అప్పగించడమే కారణం అన్నది జగమెరిగిన సత్యం. ఆ పదవిని ఇంతవరకు ముకుందన్ స్వీకరించలేదు. తాజాగా ముకుందన్ ఆ పదవిలో కొనసాగుతున్నట్టు రాందాసు స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యక్తి గత కారణాలతో తాను ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ముకుందన్ గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. తనకు పెద్దాయన(రాందాసు) దైవంతో సమానం అని, అన్బుమణి భవిష్యత్తు అని ముకుందన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆ ఇద్దరి వల్లే కూటమి
అన్నాడీఎంకే – పీఎంకే కూటమి నేచరుల్ అలయన్స్ అని వ్యాఖ్యానిస్తూ 2024 లోక్‌సభ ఎన్నికలలో కూటమి విషయంగా పళణిస్వామితో మాట్లాడాలని తాను ఆదేశించినట్టు వివరించారు. అన్నాడీఎంకేతో పొత్తు దిశగా చర్చలు జరిపి, చివరకు బీజేపీతో జత కట్టారని ధ్వజమెత్తారు. అన్బుమణి, ఆయన భార్య సౌమ్య తన రెండు కాళ్ల మీద పడి బలవంతంగా పట్టుకుని బీజేపీతో కూటమికి అంగీకరింప చేశారని ఆరోపించారు. ఈ ఇద్దరి కారణంగానే బీజేపీ కూటమిలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొని ఉంటే మూడు చోట్ల పీఎంకే, అన్నాడీఎంకే ఆరేడు చోట్ల ఎంపీ స్థానాలు గెలిచి ఉండేదన్నారు. పతనం వైపుగా పార్టీని నడిపించి బలహీన పరిచారని, ఇప్పుడు చీలిక ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సర్దుకుంటానని, పార్టీకి కార్యకర్తగా సేవ చేస్తానని అన్బుమణి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇలా తనయుడిపై రాందాసు తీవ్ర ఆరోపణలు పార్టీలో కలకలం సృష్టించాయి. అయితే, అన్బుమణి మాత్రం మౌనం వహించడం గమనార్హం. అదేసమయంలో రాందాసు తీరును పార్టీలోనే కొందరు దుయ్యబట్టేపనిలో పడగా, మరికొందరు ఆయన్ను సమర్థించడం గమనార్హం. ఈ పరిణామాలు మున్ముందు ఎలా పరిస్థితులకు దారి తీస్తాయో, పార్టీలో చీలిక తప్పదా అనే చర్చ ఊపందుకుంది.