52 వేల శునకాలకు టీకాలు వేయడమే లక్ష్యం
వేలూరు: వేలూరు జిల్లాలోని మొత్తం 52 వేల శునకాలకు టీకాలు వేయనున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లా తొర్రపాడిలోని పశు సంవవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేలూరు జిల్లాలోని వీఽధి శునకాల ద్వారా ప్రజలకు, పలు చోట్ల ట్రాఫిక్ సమస్యతో పాటూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటి, మేజర్ పంచాయతీ, కార్పొరేషన్‌లో మొదటి విడతగా శునకాలకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ టీకాలు వేయడం ద్వారా వీధి శునకాలు ఎవరినైనా కరిచినా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. అదేవిధంగా చైన్నెకి చెందిన శిక్షణ డాక్టర్‌లచే రాష్ట్రవ్యాప్తంగా శునకాలకు కు.ని ఆపరేషన్‌లు చేస్తున్నారని వారు ప్రస్తుతం తిరిచ్చి జిల్లాలో చేస్తున్నారని త్వరలోనే వేలూరు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. వారు వచ్చిన వెంటనే జిల్లావ్యాప్తంగా ఉన్న వీధి శునకాలకు కుటుంబ నియంత్రన ఆఫరేషన్‌లు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద శునకాలకు కు.ని ఆపరేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ తిరుమారన్, డాక్టర్ పాండియన్, కార్పొరేషన్ కమిషనర్ జానికి, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.


