‘కెప్టెన్’ గురుపూజోత్సవం
అభిమానుల కన్నీటి అంజలి
ప్రేమలత నేతృత్వంలో ర్యాలీ
డిప్యూటీ సీఎం ఉదయనిధి, ప్రతిపక్ష నేత పళణి నివాళి
నైనార్, పొన్నార్, మురుగన్ పుష్పాంజలి
విజయకాంత్ జ్ఞాపకాలను నెమర వేసుకున్న నేతలు
పురట్చి కలైంజ్ఞర్, డీఎండీకే దివంగత అధినేత, కెప్టెన్ విజయకాంత్‌కు పార్టీలకు అతీతంగా నేతలు అంజలి ఘటించారు. రెండో వర్ధంతిని గురుపూజోత్సవంగా డీఎండీకే నేతృత్వంలో ఆదివారం జరుపుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్ నేతృత్వంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కోయంబేడులోని కెప్టెన్ సమాధి వద్దకు పార్టీ వర్గాలు, అభిమానులు, సీని, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు తరలి వచ్చి అంజలి ఘటించారు.
సాక్షి, చైన్నె: కరుప్పు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్), కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవనటుడు)గా అశేషాభిమానుల హృదయాలలో విజయ్‌రాజ్ నాయుడు అలియాస్ విజయకాంత్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వెండి తెర మీదే కాదు, రాజకీయాలలోనూ రాణించే సమయంలో అనారోగ్య సమస్యలు ఆయన్ని ముందుకు సాగనివ్వకుండా చేశాయి. డీఎండీకే అధ్యక్షుడిగానే కాకుండా, మనవత్వం ఉన్న మనిషిగా, నాయకుడిగా ఆయన కీర్తి అభిమానుల మదిలో అజరామరం. 2023 డిసెంబరు 28వ తేదీన ఆయన అందర్నీ వీడి అనంత లోకాలకు వెళ్లారు. ఆయన మరణం తమిళ సినీ రంగానికే కాదు, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా మారింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా , ఎవరికి కష్టం, నష్టం వచ్చినా ముందుండే గొప్ప మానవతావాదిగా ముద్ర పడ్డ కెప్టెన్ అందర్నీ వీడి అనంత లోకాలకు వెళ్లి ఆదివారంతో రెండేళ్లు యింది. ఆయన వర్థంతి కార్యక్రమాన్ని గురుపూజోత్సవంగా డీఎండీకే వర్గాలు నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా సేవ కార్యక్రమాలు నిర్వహించారు. వాడవాడలా విజయకాంత్ చిత్ర పటాలను కొలువు దీర్చి పుష్పాంజలితో నివాళులర్పించారు. కోయంబేడులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవరణలో శాశ్వత నిద్రలో ఉన్న విజయకాంత్ సమాధి వద్దకు తండోప తండాలుగా డీఎండీకే కేడర్ తరలి వచ్చారు. కెప్టెన్ ఆలయంగా పిలవబడే ఆ ప్రదేశంలో కన్నీటి నివాళులతో తమ అభిమానం చాటుకున్నారు.
తరలి వచ్చిన నేతలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయకాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు రాజకీయలకు అతీతంగా పార్టీల నేతలు తరలి వచ్చారు. డీఎండీకే మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్న కూటమి పార్టీల నేతలు సైతం తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు సుబ్రమణియన్, ఏవీ వేలు తరలి వచ్చి పుష్పాంజలి ఘటించారు. ప్రేమలత విజయకాంత్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలో ఆ పార్టీ ముఖ్య నేతలు విజయకాంత్ ఆలయం పుష్పాంజలి ఘటించారు. కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్, మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తరలి వచ్చి సమాధానం, ఆలయం, విగ్రహం వద్ద అంజలి ఘటించారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతోగై, నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్, సినీ నటుడు, ముక్కళత్తోర్‌పులి పడై అధ్యక్షుడు, సినీ నటుడు కరుణాస్ తదితరులు తరలి వచ్చి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయకాంత్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను నెమర వేసుకున్నారు. గొప్ప నాయకుడైన ఆయన స్థాపించిన డీఎండీకే రానున్న ఎన్నికలలో డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడే వారితో చేతులు కలపాలని, తమ కూటమిలోకి రావాలని బీజేపీ నేతలు నైనార్, తమిళిసై, పొన్ రాధాకృష్ణన్ వేర్వేరుగా ఆహ్వానం పలకడం గమనార్హం. ఇక సీఎం స్టాలిన్ ఎక్స్‌పేజీలో విజయకాంత్‌కు నివాళుర్పించే విధంగా ఆయన ఘనతను, ఆయన మానవతా హృదయాన్ని, పేదలకు ఇచ్చిన ఆప్పన్న హస్తం గురించి గుర్తు చేస్తూ మనస్సున్న మహారాజు అని వ్యాఖ్యలు చేశారు. కాగా 100 మంది అభిమానులు విజయకాంత్ పేరుతో మండల దీక్ష చేపట్టి ఇరుముడితో వచ్చి కెప్టెన్ సమాధి వద్ద తల వెంట్రులకు ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం విశేషం.
విజయకాంత్ సమాధి వద్ద ప్రేమలత, ఉదయనిధి స్టాలిన్ నివాళులు
విజయకాంత్ విగ్రహానికి పుష్పాంజలి
ఎల్. మురుగన్, నైనార్ నాగేంద్రన్ అంజలి
శాంతి ర్యాలీగా ..
కోయంబేడు సమీపంలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద నుంచి విజయకాంత్ సమాధి వరకు ర్యాలీ నిర్వహించేందుకు డీఎండీకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఉదయాన్నే డీఎండీకే వర్గాలు, అభిమాన లోకం నల్ల వస్త్రాలను ధరించి తండోప తండాలుగా తరలి వచ్చారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, విజయకాంత్ కుమారులు విజయప్రభాకరన్, షణ్ముగ పాండియన్, బావ మరిది సుదీష్‌తోపాటూ పార్టీ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. విజయకాంత్ చిత్ర పటంతో శాంతి ర్యాలీ నిర్వహించారు. సమాధి వద్దకు చేరుకుని కన్నీటి నివాళులర్పించారు. సమాధి పరిసరాలను పలు వర్ణ పుష్పాలతో అలంకరించారు. అక్కడి విగ్రహం పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. కెప్టెన్ ఆలయంగా పిలవడే ఈ ప్రదేశంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని ప్రేమలత కన్నీటి పర్యంతమయ్యారు. ఈసమయంలో విజయకాంత్ కుమారుడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఉదయం నుంచిరాత్రి వరకు డీఎండీకే వర్గాలు, అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయకాంత్‌కు నివాళులర్పించారు. అభిమానుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా భోజనాలను అందజేశారు.
‘కెప్టెన్’ గురుపూజోత్సవం
‘కెప్టెన్’ గురుపూజోత్సవం
‘కెప్టెన్’ గురుపూజోత్సవం


