మహిళా ప్రభంజనమే లక్ష్యం
– నేడు పల్లడం వైపుగా డీఎంకే చూపు
సాక్షి, చైన్నె : మహిళా పథకాలకు ఏ మేరకు ఆదరణ ఉందో చాటే దిశగా డీఎంకే మిహిళా విభాగం నేతృత్వంలో సోమవారం తిరుప్పూర్‌జిల్లాలో మహానాడు జరగనుంది. లక్షన్నర మంది మహిళలు ఈ మహానాడుకు తరలివచ్చే విధంగా ఆ విభాగం కసరత్తు చేపట్టింది. మళ్లీ అధికారం లక్ష్యంగా డీఎంకే ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే ప్రభుత్వ పథకాలలో మహిళ కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో బస్సు సేవలు ఉచితం, నెలకు గృహిణులకు రూ. 1000 పంపిణీ, విద్యార్థునులకు రూ. 1000 పుదుమై పెన్ పథకం వంటి పథకాలు మరింత బృహత్తరమైనవి. ఇందులో కోటి యాభైలక్షలమంది వరకు మహిళా హక్కు పథకం ద్వారా నెలకు రూ. 1000 పొందుతూ వస్తున్నారు. మహిళలు,యువతులు, విద్యార్థునుల ఓట్ల ఆధారంగా మళ్లీ అధికారంలోకి రావచ్చు అన్న ధీమాతో ఉన్న స్టాలిన్ తాజాగా డీఎంకే మహిళా విభాగం మహానాడుకు సిద్దమయ్యారు. తిరుప్పూర్‌జిల్లా పల్లడం వేదికగా సోమవారం మహానాడు జరగనుది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరగనున్న ఈ మహానాడును స్టాలిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహిళా ఓటు బ్యాంక్ తమ వైపు అని చాటుకునే దిశగా ఈమహానాడును జయ ప్రదం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో కనీసం లక్షన్నర మంది మహిళలను తరలించే దిశగా కార్యాచరణలో ఉన్నారు. మహిళలు అంతా డీఎంకే వైపు అని చాటే విధంగా ఈ మహానాడు జయప్రదానికి చర్యలు విస్తృతం చేశారు. 200 స్థానాలలో విజయ కేతనం ఎగుర వేయాలంటే మహిళా మద్దతు తప్పనిసరిగా భావించిన స్టాలిన్ ఈ మహానాడును మరింత ప్రతిష్టాత్మంగా తీసుకోవడమే కాకుండా, ఈ వేదికపై మరిన్ని మహిళా పథకాలను, తాజా పథకాల విస్తృతం గురించి డీఎంకే తరపున ప్రకటన వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


