అన్బుమణి కారణంగా పాతాళంలోకి పీఎంకే
సాక్షి,చైన్నె: అన్బుమణి రూపంలో పీఎంకే పాతాళంలోకి జారిపోతోందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి ధ్వజమెత్తారు. సేలంలో సోమవారం రాందాసు నేతృత్వంలోని పీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. పీఎంకేను తమ గుప్పెట్లోకి తెచ్చుకునే విధంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య వార్‌ముదిరిన విషయం తెలిసింది. తాజాగా కేంద్రంలోని బీజేపీ సహకారంతో ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీని అన్బుమణి తన గుప్పట్లోకి తెచ్చుకున్నారు. రాందాసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేతలను పార్టీ నుంచి సాగనంపుతున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షుడ, ఎమ్మెల్యే జీకేమణిని శనివారం పార్టీ నుంచి బయటకు పంపించారు. అయితే తనను తొలగించే అధికారంలో రాందాసుకు మాత్రమే ఉందని జీకేమణి స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో సోమవారం సేలం వేదికగా రాందాసు నేతృత్వంలోని పీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఇందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. వన్నియర్ సామాజిక వర్గం బలాన్ని చాటే విధంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ పరిస్థితులలో శనివారం జీకేమణి మీడియాతో మాట్లాడుతూ అన్బుమణిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అన్బుమణి చర్యలతో రాందాసు తీవ్ర మనో వేదనలో మునిగి ఉన్నారని ఉద్వేగానికి లోనయ్యారు. పెద్దాయనకు అన్బుమణి గొప్ప కానుక ఇచ్చాడని, పార్టీని హైజాక్ చేసేందుకు తీవ్ర కుట్రలను రచిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజకీయాల గురించి పూర్తిగా తెలియని అన్బుమణి రూపంలో పీఎంకే పాతాళంలోకి నెట్టబడిందని, తాజాగా పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్బుమణికి గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, రాందాసు తరపు పీఎంకే ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అరుల్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం జరిగే సర్వసభ్యం భేటీ కీలక మలుపు కానుందని, వన్నియర్ సామాజిక వర్గం అంతా ఈ భేటీకి తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా సేలం వేదికగా సోమవారం జరిగే సర్వ సభ్య సమావేశంలో కూటమి నిర్ణయాన్ని రాందాసు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇది డీఎంకేతోనా లేదా అన్నాడీఎంకే – బీజేపీతోనా అన్నది తేలననుంది.


