కాంగ్రెస్‌ నోట వాటా మాట! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నోట వాటా మాట!

Dec 29 2025 8:05 AM | Updated on Dec 29 2025 8:05 AM

కాంగ్రెస్‌ నోట వాటా మాట!

కాంగ్రెస్‌ నోట వాటా మాట!

– టీఎన్‌సీసీ అధ్యక్షుడు సైతం వ్యాఖ్యల తూటా

సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి అధికారంలోకి వస్తే వాటా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ను డీఎంకే ముందు కాంగ్రెస్‌ ఉంచబోతోంది. మొన్నటి వరకు ముఖ్య నేతలతో ఈ నినాదాన్ని పదేపదే గుర్తు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సైతం ఇదే స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులో ఆదివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై సైతం ఈ స్వరాన్ని అందుకోవడం డీఎంకేను సందిగ్ధంలోకి నెట్టినట్లయ్యింది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కాంగ్రెస్‌ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2026 ఎన్నికలలో డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ కొనసాగే దిశగానే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో టీవీకే నేత విజయ్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారాలు, పుకార్లు బయలు దేరాయి. అలాగే కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం తన మహానాడులో విజయ్‌ పేర్కొన్నట్టుగా అధికారంలో వాటా అన్న స్వరాన్ని అందుకునే పనిలో పడ్డారు. ముఖ్యనేతలందరూ తరచూ ఇదే వ్యాఖ్యలను సందిస్తూ రావడం డీఎంకేను ఇరకాటంలో పెట్టినట్లయ్యింది. ఎట్టకేలకు ఈ ప్రచారానికి ముగింపు పలికే విధంగా ఏఐసీసీ పెద్దల ద్వారా చెక్‌ పెట్టించారు. అదే సమయంలో డీఎంకేతో కూటమి బంధం పదిలం చేసుకోవడంతో పాటూ ముందుగానే సీట్ల పందేరం ముగించే విధంగా ఏఐసీసీ పెద్దలు ఓ కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇప్పటికే టీఎన్‌సీసీ నేతలతో సమావేశమైంది. ఇందులో అధికారంలో వాటా నినాదం జ్వలించింది. ఇక డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గిరిష్‌ చోదనక్కర్‌, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్‌ హెగ్డే, నివేదిత్‌ఆళ్వాలు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్‌కుమార్‌తో కూడిన కమిటీ భేటీ అయింది. తమ తరపున ఎన్ని సీట్లు ఆశిస్తున్నామో అన్న డిమాండ్‌ను డీఎంకే ముందు జాబితా రూపంలో ఉంచారు. అయితే, ఇంత వరకు డీఎంకే ఆ జాబితాను పరిశీలించ లేదు. జనవరిలో ఏర్పాటయ్యే తమ కమిటీతో చర్చించి నిర్ణయం అని దాట వేసింది.

మళ్లీ అదే నినాదం

డీఎంకేను ఈసారి 70 సీట్లు ఇవ్వాల్సిందేనన్న పట్టు తో కాంగ్రెస్‌ ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. అయితే గత ఎన్నికలలో ఇచ్చిన 25 సీట్లలో 18 చోట్లే కాంగ్రెస్‌ గెలిచిన దృష్ట్యా, ఈసారి అదనంగా ఐదు స్థానాలలోపు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ సీట్లతో సర్దుకునే దిశగా కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. తక్కువ సీట్లు ఇస్తే, అధికారంలో వాటా ఆశించే విధంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గిరిష్‌ చోదనక్కర్‌ గళా న్ని విప్పడం డీఎంకే నిశితింగా పరిశీలించే పనిలో పడింది. తమిళనాట సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదన్నది ఆది నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈసారి సంపూర్ణ మెజారిటీతో నెగ్గినా, నెగ్గక పోయినా, అధికారంలో వాటా దిశగా కాంగ్రెస్‌ చూపు ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఆదివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై వ్యాఖ్యల తూటా పేల్చడం గమనార్హం. తమ ఇన్‌చార్జ్‌ చోదనక్కర్‌ మాటే తమ మాట అని వ్యాఖ్యానించారు. అధికారంలో వాటా అన్నది కాంగ్రెస్‌ నిర్ణయం అని, ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతం కాదని స్పందించడం గమనార్హం. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కాంగ్రెస్‌కు చేత కావు అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. డీఎంకేను ఇరకాటంలో పెట్టే దిశగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అధికారంలో వాటా గళాన్ని జ్వలింప చేసే పనిలో పడటంతో మున్ముందు రోజులలో డీఎంకే కూటమిలో ఎలాంటి పరిణామాలు బయలు దేరుతాయో వేచిచూడాల్సిందే. అదే సమయంలో ఈ కూటమిలోని వీసీకే నేత తిరుమావలవన్‌ సైతం ఓ ఇంటర్వ్యూలో సమయం, పరిస్థితులను బట్టి అధికారంలో వాటా తప్పని సరి అని స్పందించడం గమనార్హం. అయితే, ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలను స్టాలిన్‌ తన రాజకీయ పరిజ్ఞానంతో తిప్పి కొట్టే అవకాశాలు ఎక్కువేనని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement