పార్టీ బలోపేతమే లక్ష్యం
● బీజేపీ నేతలకు నడ్డా ఆదేశం
సాక్షి, చైన్నె: బలోపేతం లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని, తమిళనాట పాగా వేయాల్సిందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతలకు ఆదేశాలు ఇచ్చారు. పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతం, అన్నాడీఎంకేతో కలిసి కూటమిలోకి మరిన్ని పార్టీలను ఆహ్వానించే దిశగా కార్యాచరణకు సిద్ధం కావాలని సూచించారు. చైన్నె శివారులో శనివారం బీజేపీ రాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, రాష్ట్ర వ్యవహారాల కో– ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నేతలు తమిళి సై సౌందర రాజన్, వానతీ శ్రీనివాసన్, పొన్ రాధాకృష్ణన్, హెచ్ రాజా తదితరులు పాల్గొన్నారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఈసందర్భంగా నేతలకు నడ్డా వివరించారు. కేంద్ర పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ పరంగా ప్రచార సభల నిర్వహణ, బూత్ స్థాయిలో బలోపేతం దిశగా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల గురించి, లోక్‌సభ ఎన్నికల సమయంలో సాధించిన ఓటు బ్యాంక్ ఆధారంగా మరికొన్ని నియోజకవర్గాల గురించి వివరాలను నడ్డా దృష్టికి నైనార్ నాగేంద్రన్ తీసుకెళ్లినట్టు సమాచారం. పార్టీ బలోపేతంతో పాటుగా అన్నాడీఎంకే కూటమిలోకి మరిన్ని పార్టీలు చేరే విధంగా, డీఎంకే పతనం లక్ష్యంగా కార్యక్రమాలు వేగవంతం కావాలని నేతలకు నడ్డా ఆదేశించారు. తమిళనాడులో కూటమి అధికారంలోకి రావడమే ద్యేయం అని, సమష్టిగా పనిచేయాలని సూచించినట్టు ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. తమిళగ వెట్రికళగం నేత విజయ్ బలా బలం గురించి సైతం ఈ సమావేశంలోచర్చకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ గురించి సైతం చర్చ జరిగినట్టు సమాచారం. ఈ ఇద్దరి ఓటు బ్యాంక్‌ను పరిగణించి వారిని కూటమిలోకి రప్పించే వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలో తాను చేరాలంటూ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న సంకేతాన్ని సీమాన్ పంపించినట్టు ప్రచారం సాగుతుండడం గమనార్హం.


