
ఉన్నత విద్యపై అవగాహన సదస్సు
వేలూరు: పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యలో ఎటువంటి కోర్సులను అభ్యసించాలనే వాటిపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ, కళాశాల కళలు ఆధ్వర్యంలో వేలూరు వీఐటీ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ పరీక్షలను రాసిన విద్యార్థులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సదస్సులో వేలూరు జిల్లా నుంచి మొత్తం 85 పాఠశాలల నుంచి 1500 మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారన్నారు. ప్లస్‌టూ పూర్తి చేసిన విద్యార్థులు ఎటువంటి కోర్సులను అభ్యసిస్తే మంచిదనే వాటిపై ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం తీసుకునే కోర్సులతోనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం అనేక మంది ఇంజినీరింగ్, మెడిసిన్ కోసమే ఆశ పడుతుంటారని అయితే వాటిలో కూడా ఎటువంటి కోర్సులను అభ్యసిస్తే ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తున్నాయనే వాటిని తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం మీరు తెలుసుకున్న ఈ విషయాలను సమీపంలోని విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ దయాళన్, అసిస్టెంట్ డైరెక్టర్ గాయత్రి, ఉన్నత విద్యాశాఖ సలహాదారులు జయప్రకాష్ గాంధీ, ప్రొఫెసర్ సెల్వం, మేఘల, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.