ఆర్థికావృద్ధిలో వాణిజ్య వాహనాలు కీలకం
● సీఐఐ సమ్మిట్‌లో నిపుణుల వ్యాఖ్య
సాక్షి, చైన్నె: భారతదేశ ఆర్థికావృద్ధికి, జాతీయ పోటీతత్వానికి కీలక శక్తిగా వాణిజ్య పరమైన వాహనాలు నిలుస్తున్నాయని టాటా మోటార్స్ అధ్యక్షుడు రాజేంద్ర పెట్కర్ వ్యాఖ్యానించారు. సీవీలు భారత్ పవర్‌హౌస్‌లు అన్న నినాదంతో సీఐఐ దక్షిణ రీజియన్ సమ్మిట్–2025 శుక్రవారం స్థానికంగా జరిగింది. ఇందులో రాజేంద్ర పెట్కర్ మాట్లాడుతూ భారతదేశ వాణిజ్య వాహన పరిశ్రమ కీలకమైన మలుపులో పయనిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా, పరివర్తన అవకాశాలతో నిండి ఉందన్నారు. ప్రపంచ అనిశ్చితి మధ్య స్థితిస్థాపక శక్తిగా ఉండడం, భారతదేశ వృద్ధిలో కీలకమైన శక్తిగా మారడం వరకు, ఈ రంగం ఆర్థిక ఆశయాలు, సాంకేతిక చురుకుదనాన్ని ప్రతిబింబిస్తున్నదన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నందున, వాణిజ్య వాహనాలు ప్రతిరంగంలోనూ సర్వవ్యాప్తంగా ఉన్నాయన్నారు. ఇది అక్షరాలా పురోగతికి శక్తినిస్తున్నాయని, జాతీయ పోటీతత్వానికి దోహదపడుతున్నాయని, ‘భారత్‌ను నిర్మించడానికి శక్తి కేంద్రం’ నిలుస్తున్నాయని వివరించారు. సీఐఐ డిప్యూటీ చైర్మన్ పి.రవిచంద్రన్, సమ్మిట్ చైర్మన్ ప్రదీప్‌కుమార్ తిమ్మయ్యన్ పాల్గొన్నారు.


