టాస్మాక్ చర్చ!
● బెంచ్‌ల మార్పునకు పట్టు
సాక్షి, చైన్నె : టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాల వ్యవహారం న్యాయ వర్గాలకు చిక్కుగా మారింది. ఈ కేసు విచారణ బెంచ్ మార్పు వ్యవహారం చర్చకు దారి తీసింది. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో గత నెల 6వ తేది నుంచి 8వ తేది వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఇందులో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారం వెలువడింది. ఈ వ్యవహారంలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, అధికారుల తరపున హైకోర్టుకు పిటిషన్ చేరగా, ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తొలుత కేసును విచారించిన న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎం. సెంథిల్‌కుమార్ బెంచ్ ఆదేశించింది. మూడు వారాల పాటూ ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్ చివరకు తమకు వద్దే..వద్దు అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్‌కు న్యాయమూర్తులు సూచించారు. దీంతో బెంచ్ మార్పు అనివార్యమైంది. చివరకు న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్రమణియన్, కె రాజశేఖర్ బెంచ్‌కుమార్చారు. ఈ బెంచ్‌లోని న్యాయమూర్తి రాజశేఖర్, టాస్మాక్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రి సెంథిల్ బాలాజీ న్యాయవాది అన్నదమ్ముళ్లుగా తేలింది. దీంతో ఈడీ తరపున హాజరైన న్యాయవాది ఈ బెంచ్‌ను మార్చాలని పట్టుబట్టారు. ఈ కేసు తుది విచారణ ఏప్రిల్ 8,9 తేదీలలో జరుగుతాయని ప్రకటించారు. అదే సమయంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్‌న్యాయమూర్తి మహ్మద్ షబిక్ బెంచ్ ముందు మంత్రి సెంథిల్ బాలాజీ తరపున హాజరైన న్యాయవాది బాలాజీ తన తరపు విజ్ఞప్తిని ఉంచారు. టాస్మాక్ కేసు విచారిస్తున్న జస్టిస్ రాజశేఖరన్ మంత్రి సెంథిల్ బాలాజీ న్యాయవాది సహోదరుడు అని, ఈ దృష్ట్యా, కేసును మరో బెంచ్‌కు అప్పగించాలని కోరారు. ఇందుకు సీజే బెంచ్‌స్పందిస్తూ, తాము జోక్యం చేసుకోబోమని, మరో బెంచ్ విచారణకు మార్చలేమని, అయితే సంబంధిత బెంచ్ న్యాయమూర్తుల వద్ద అప్పీల్ చేసుకోవచ్చు అని సూచించారు. ఇందుకు తగ్గ కసరత్తులలో ఓ వైపు ఈడీ తరపున, మరో వైపు సెంథిల్ బాలాజీ తరపున న్యాయవాదులు ప్రయత్నాలు చేపట్టడంతో టాస్మాక్ స్కాంలో మరో బెంచ్ ప్రవేశించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.


