సాక్షి, చైన్నె : డీఎంకే ఎమ్మెల్యే అన్నియూరు శివకు హైకోర్టు రూపంలో ఊరట కలిగింది. ఆయన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఎమ్మెల్యే పుగలేంది మరణంతో గత ఏడాది విల్లుపురం జిల్లా విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివ 67 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈగెలుపును వ్యతిరేకిస్తూ మక్కల్‌శక్తి కట్చికి చెందిన అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలలో అక్రమాలు జరిగినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగా, దీనిని రద్దుచేయాలని కోరుతూ శివ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం విచారణ అనంతరం అన్నియూరు శివ గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను న్యాయమూర్తి ఇలంథిరియన్ తోసి పుచ్చారు. దీంతో శివకు ఊరట కలిగినట్లయ్యింది.


