ఆయుధ పూజ సందడి | - | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజ సందడి

Oct 11 2024 1:24 AM | Updated on Oct 11 2024 4:34 PM

చైన్నెలో పూజా సామగ్రి విక్రయాలు

చైన్నెలో పూజా సామగ్రి విక్రయాలు

మార్కెట్లన్నీ కిటకిట 

పూజా సామగ్రి ధరలకు రెక్కలు 

చైన్నె నుంచి స్వస్థలాలకు తరలిన జనం 

రోడ్డెక్కిన ప్రత్యేక బస్సులు 

ప్రజలకు నేతల శుభాకాంక్షలు 

కుల శేఖరపట్నంలో సంబరాలు

రాష్ట్రంలో ఆయుధ పూజ సందడి నెలకొంది. పండుగ శుక్రవారం కావడంతో గురువారం పూజా సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక కుటుంబ సభ్యులతో పండుగను ఆనందోత్సాహలతో జరుపుకునేందుకు చైన్నె నుంచి లక్షలాదిమంది ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.

సాక్షి, చైన్నె: ఆధ్యాత్మికతకు నెలవుగా ఉన్న తమిళనాడులో పండుగలొస్తే సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఎక్కడెక్కడో వివిధ పనుల నిమిత్తం స్థిర పడ్డ వాళ్లంతా శ్రమ కోర్చి సెలవులకు స్వస్థలాలకు చేరుకుంటారు. రాష్ట్రంలో సంక్రాంతి, వినాయక చవితి తదుపరి వచ్చే ఆయుధ పూజ, విజయ దశమి పర్వదినాలకు ప్రజలు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. ఇందులో చిన్నచిన్న దుకాణాల మొదలు అతిపెద్ద ఫ్యాక్టరీల వరకు, కూలీల మొదలు రైతుల వరకు తాము ఉపయోగించే వివిధ రకాల సామగ్రి, పనిముట్లకు పూజలు నిర్వహించే రీతిలో ఆయుధ పూజను అత్యంత భక్తిశ్రద్ధల పర్వదినంగా భావిస్తుంటారు. ఇంటిళ్లి పాది అత్యంత భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.

నేతల శుభాకాంక్షలు..

ఆయుధ పూజ, విజయ దశమి పండుగలను ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌, మాజీ సీఎం పన్నీరు సెల్వం, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌, బీజేపీ నేతలు తమిళి సై సౌందరరాజన్‌, శరత్‌కుమార్‌, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు తదితరులు ఉన్నారు.

స్వస్థలాలకు పయనం..

ఈ ఏడాది పండుగకు మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధిక శాతం మంది స్వస్థలాలకు వెళ్లి ఇంటిళ్లి పాది ఆయుధ పూజను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చైన్నె వంటి నగరాలలో వివిధ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలలో ఉన్న వాళ్లు దక్షిణ తమిళనాడులోని తిరుచ్చి, దిండుగల్‌, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, కొంగు మండలంలోని సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు జిల్లా లో ఉన్న తమ స్వస్థలాలకు అత్యధికంగా బయలు దేరి వెళ్లారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించడంతో లక్షల మంది ఆయుధ పూజ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లినట్టు రవాణా సంస్థ పరిశీలనలో తేలింది. చైన్నె, శివారులలోని బస్టాండ్‌ల అర్ధరాత్రి వరకు బస్సులు కిక్కిరిసి వెళ్లాయి. సుమారు 4 వేల బస్సులను చైన్నె నుంచి నడిపారు. ఇదే అదనుగా ఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచేశాయి. విమాన టికెట్లు సైతం గాల్లో ఎగిరాయి. మదురై, తిరుచ్చి, తూత్తుకుడి,సేలంలకు విమాన చార్జీలు రెండింతలు పెరిగాయి.

కులశేఖరపట్నంలో..

తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో దసరా సంబరాలు మిన్నంటుతున్నాయి. మైసూర్‌ తదుపరి దసరా ఉత్సవాలు కులశేఖర పట్నంలోని ముత్తాలమ్మన్‌ ఆలయంలో కనుల పండువగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఆయుధపూజ, విజయ దశమి వేళ ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు కాళి మాత వేషధారణలతో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాము విరాళాల రూపంలో సేకరించిన కానుకలను అమ్మవారి హుండీలో సమర్పిస్తున్నారు. పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో కులశేఖర పట్నంలో ఇసుక వేస్తే రాలనంతంగా కిక్కిరిసి ఉన్నాయి. ఇక్కడ విజయ దశమి పర్వదినం రోజైన 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సాగర తీరంలో శూర సంహారం అత్యంత వేడుకగా జరగనుంది. లక్షలలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని శివాలయాలు, అమ్మవారి ఆలయాలలో, తమ ఇళ్లల్లో నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తు వస్తున్నారు. విజయ దశమి వేళ ఆలయాలలో, ఇళ్లల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను అందుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు.

మార్కెట్లు కిటకిట

ఆయుధ పూజ కోసం ఉపయోగించే పూజా సామగ్రి రాష్ట్రంలోని మార్కెట్లోకి పెద్దఎత్తున కొలువు దీరాయి. మరమరాలు(బొరుగులు), అటుకులు, బెల్లం, యాపిల్‌, ఆరంజ్‌ తదితర పండ్లు, వివిధ రకాల పువ్వులు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు నిమిత్తం జనం మార్కెట్ల వైపుగా కదిలారు. రాష్ట్రంలోని మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం తదితర నగరాలలోని చిన్న పెద్ద మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. చైన్నెలోని టీ నగర్‌, పురసైవాక్కం, బ్రాడ్‌ వే మార్కెట్లు, దక్షిణాసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న కోయంబేడు జనంతో నిండాయి. ఎటు చూసినా కొనుగోలు దారులతో వర్తక కేంద్రాలు కిక్కిరిశాయి. పూజా సామాగ్రి, పండ్లు, పువ్వుల ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి. ధర పెరిగినా, తమ స్తోమతకు తగ్గట్టుగా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయుధ పూజ, శనివారం విజయదశమి పండుగకు కావాల్సిన అన్నిరకాల పూజాసామాగ్రిని సిద్ధం చేసు కున్నారు.

పూల మార్కెట్ లో  రద్దీ1
1/1

పూల మార్కెట్ లో రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement