తిరువొత్తియూరు: వన్‌సైడ్ లవ్ కారణంగా నర్స్‌ను కారులో కిడ్నాప్ చేసిన యువకుడు, అతనికి స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె వేళచ్చేరిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో 23 సంవత్సరాల యువతి నర్సుగా పనిచేస్తున్నారు. ఈమె శనివారం ఉదయం వేళచ్చేరి ఝాన్సీ నగర్‌లో ఉన్న ఆసుపత్రి హాస్టల్ నుంచి పనికి బయల్దేరింది. ఆ సమయంలో కారులో వచ్చిన ఇద్దరు నర్సును బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. కారు లోపల మరో ఇద్దరు ఉన్నారు. ఇది చూసిన స్థానికులు వేళచ్చేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గిండి పోలీసు సహాయ కమిషనర్ శివ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ జయచంద్రన్, పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న నిఘా కెమెరాల్లో నమోదైన కారు రిజిస్టర్ నెంబరు ఆధారంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో నర్స్‌ను కిడ్నాప్ చేసిన ఆ కారు తాంబరంలో నుంచి చెంగల్పట్టు మార్గంగా వెళ్తున్నట్లు కనుగొన్నారు. పోలీసులు కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోపు అక్షరపాకం టోల్‌గేట్ వద్ద కారును అడ్డుకుని నిలిపారు. కారు లోపల నర్సు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆమెను కిడ్నాపర్ల నుంచి విడిపించారు. కిడ్నాప్ చేసిన రామనాథపురం తిరువడనై బర్గూరు ప్రాంతానికి చెందిన సభాపతి (27), అతని స్నేహితులు హరీష్ (20), అజయ్ (25), రమేష్ (40) తదితరులను పోలీసులు వేళచ్చేరి నుంచి అక్షరపాకం పోలీసుస్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారణ చేశారు. పోలీసుల వద్ద సభాపతి తాను నర్సును వన్ సైడ్ లవ్ చేస్తున్నానని, ప్రేమించడానికి తిరస్కరించడంతో కారులో కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. దీనిపై నర్సు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సభాపతి, నలుగురిని అరెస్టు చేసి జైలు తరలించారు.