
ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌కు వినతి పత్రం అందజేస్తున్న పట్రపెరంబదూరు గ్రామస్తులు
తిరువళ్లూరు: రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటి పట్టాలను ఇవ్వాలని కోరుతూ పట్రపెరంబదూరు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తిరునిండ్రవూర్ నుంచి తిరుపతి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులను పదేళ్ల క్రితం చేపట్టారు. రోడ్డు విస్తరణలో భాగంగా పట్రపెరంబదూరు గ్రామానికి చెందిన 93 ఇళ్లను తొలగించారు. బాధితులకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను కేటాయిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. ఇందు కోసం గ్రామంలోని సుమారు ఆరు ఎకరాల భూమిని ఎంపిక చేసి వారికి ఇంటి పట్టాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పట్టా పంపిణీపై ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా పట్టా పంపిణీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమకు ఇంటి పట్టాలను ఇవ్వడంతో పాటు పక్కాగృహాలను నిర్మించి ఇవ్వాలని కోరారు. సమస్యను పరిస్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.