తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ పరేడ్
తిరుత్తణి: తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో ఇటీవల కాలంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికులకు రక్షణ, సురక్షితమైన ప్రయాణం పట్ల భరోసా కల్పించే విధంగా సదరన్ రైల్వే డీఐసీ ఇబ్రహిం షెరీఫ్ ఆధ్వర్యంలో 41 మంది ఆర్‌పీఎప్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు సహా 60 మంది శనివారం రైల్వే స్టేషన్‌లో మార్చింగ్ పరేడ్ నిర్వహించారు. గన్‌తో స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం, ప్రయాణికుల బస కేంద్రం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, రైల్వే విడిది సహా పలు ప్రాంతాల్లో రైల్వే పోలీసులు మార్చింగ్ నిర్వహించి సురక్షితమైన ప్రయాణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించి భరోసా ఇచ్చారు. అనంతరం డీఐజీ ఇబ్రహిం షెరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. రైలు ప్రయాణికులకు రక్షణ కల్పించడం ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు. నిత్యం రైల్వే స్టేషన్‌లలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ టీవీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు చెప్పారు. అనుమానం ఉన్న వ్యక్తుల సంచారంపై రైల్వే స్టేషన్ మాస్టర్‌కు లేదా రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ ఓపీ స్టేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.


