షణ్ముఖర్‌కు బిల్వార్చన
కాంచీపురం: గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి దామో అన్బరసు అధికారులకు సూచించారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రజాప్రతినిధుల కోర్కెలు పరిష్కరించే విధంగా ప్రతివారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా నుంచి ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సూక్ష్మ, చిన్న సన్నకారు పరిశ్రమల శాఖమంత్రి దామో అన్బరసు పాల్గొని ప్రజా ప్రతినిధుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానంగా రోడ్లు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు, ఉచిత ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కట్టడాల ఏర్పాటుకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ కలైసెల్వి, కాంచీపురం ఎంపీ సెల్వం, శ్రీపెరంబదూరు ఎమ్మెల్యే సెల్వపెరందగై ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
సాక్షి, చైన్నె : మద్రాసు హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇందులో ఒకరు అలహాబాద్, మరొకరు తెలంగాణ హైకోర్టుల నుంచి బదిలీపై వచ్చారు. మద్రాసు హైకోర్టులో మొత్తం 75 మంది న్యాయమూర్తులు అవసరం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 64 మంది ఉన్నారు. మరో 11 మంది అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వివేక్‌కుమార్ సింగ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం. సుధీర్‌కుమార్‌ను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఈ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 66కు చేరింది. మరో తొమ్మిది మంది న్యాయమూర్తులు అవసరం ఉంది.
ద్విచక్ర వాహనాలు ఢీ
● ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
తిరువళ్లూరు: గుమ్మిడిపూండి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో బాలుడు చైన్నె ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పొన్నియమ్మన్‌మేడు ప్రాంతానికి చెందిన మహేష్(32). ఇతను తన అక్క కొడుకులు నితీష్(12), ఆకాష్(14)తో కలిసి ద్విచక్ర వాహనంలో గుమ్మిడిపూండి నుండి బజారుకు బయలుదేరాడు. ఇదే సమయంలో తేరువాయి కండ్రిగ గ్రామానికి చెందిన సత్య(32) మరో బైక్‌లో గుమ్మిడిపూండికి వస్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు నేరుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను స్థాఽనికంగా వున్న ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సత్య(32)ను చైన్నె స్టాన్లీ వైద్యశాలలో మరణించాడు. నితీష్(12)కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మహేష్ సోదరుడు రాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుమ్మిడిపూండి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుత్తణిలో స్కందషష్టి
ఉత్సవాలు ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం లక్షార్చనతో స్కందషష్టి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు మురుగన్ మాలధారణచేసి స్కంధషష్టి కవచం పఠనంతో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మూలవిరాట్‌కు సుగంద ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టి బంగారు. వజ్రాభరణాలతో అలంకరించి మహాదీపారాధన పూజలు చేశారు. భక్తులు మాలధారణ చేసి దీక్షలు చేపట్టి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటలకు కావడి మండపంలో షణ్ముఖర్‌కు పుష్పలంకరణతో మహాదీపారాధన పూజలు చేపట్టి బిల్వార్చనతో స్కందషష్టి వేడుకలకు శ్రీకారం చుట్టారు. వేడుకలు జరుగనున్న ఏడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామికి బిల్వార్చన నిర్వహిస్తారు. 18న సాయంత్రం వివిధ పుష్పాలతో షణ్ముఖర్‌కు పుష్పసేవ నిర్వహిస్తారు. 19న కల్యాణోత్సవం ఉంటుంది. ఉత్సవ వేడుకలు సందర్భంగా స్కందషష్టి పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి గీతాలాపన, భరతనాట్యం వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ఆలయ ధర్మపాలక మండలి అధ్యక్షుడు శ్రీధరన్, ధర్మపాక మండలి సభ్యులు ఉషారవి, మోహనన్, సురేష్ బాబు, నాగన్ బృందం వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


