డీఐజీ ఆత్మహత్య : ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

డీఐజీ ఆత్మహత్య : ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు..

Jul 8 2023 11:02 AM | Updated on Jul 8 2023 11:26 AM

- - Sakshi

తీవ్ర మానసికఒత్తిడికి లోనైన కోయంబత్తూరు రేంజ్‌ డీఐజీ విజయకుమార్‌(45) శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ తీసుకుని తనకు తాను కాల్చుకుని మృత్యుఒడిలోకి చేరారు. ఈ సమాచారం పోలీసు యంత్రాంగాన్ని షాక్‌కు గురిచేసింది. డీజీపీ శంకర్‌ జివ్వాల్‌, ఏడీజీపీ అరుణ్‌ హుటాహుటిన కోయంబత్తూరుకు చేరుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సీఎం స్టాలిన్‌ తన సానుభూతి తెలియజేశారు. అధికార లాంఛనాలతో స్వస్థలం తేనిలో విజయకుమార్‌ భౌతికకాయానికి సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

సాక్షి, చైన్నె: కోయంబత్తూరు రేంజ్‌ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌(45) పదోన్నతి పొందారు. ఆయనకు భార్య గీతావాణి, కుమార్తె నందిత ఉన్నారు. రేస్‌కోర్సు రోడ్డులోని క్యాంప్‌ కార్యాలయం క్వార్టర్స్‌లో నివాసం ఉన్నారు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వచ్చిన ఆయన సరిగ్గా 6.45 గంటల సమయంలో తన భద్రతా సిబ్బంది రవి వద్ద ఉన్న తుపాకీ తీసుకున్నారు. తన కణత కుడివైపుగా భాగంలో తుపాకీతో కాల్చుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది కలవరం చెందారు. క్యాంప్‌ కార్యాలయంలో ఉన్న వాళ్లంతా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కోయంబత్తూరు కమిషనర్‌ బాలకృష్ణన్‌, ఎస్పీ బద్రినారాయణన్‌, ఐజీ సుధాకర్‌ క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

మానసిక ఒత్తిడికి కారణం ఏమిటో...
తుపాకీతో కాల్చుకుని డీఐజీ మరణించిన సమాచారంతో డీజీపీ శంకర్‌జివ్వాల్‌తోపాటు పోలీసు యంత్రాంగమే షాక్‌కు గురైంది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ అరుణ్‌ నేతృత్వంలోని విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం కోయంబత్తూరుకు చేరుకుని విచారణ చేపట్టింది. గత కొంతకాలంగా విజయకుమార్‌ తీవ్ర మానసికఒత్తిడితో ఉన్నట్టు, ఆయన కౌన్సెలింగ్‌ తీసుకున్నట్టు తేలింది. రాత్రుల్లో నిద్రలేమి కారణంగా మాత్రలను వాడుతూ వచ్చినట్టు గుర్తించారు. గురువారం ఐజీ సుధాకర్‌, ఎస్పీ బద్రినారాయణన్‌తో కూడా విజయకుమార్‌ మాట్లాడినట్టు, ఓ సిబ్బంది కుమార్తె బర్త్‌డే వేడుకకు వెళ్లి వచ్చినట్టు తెలిసింది. ఈ బర్త్‌డేలో ఆయన మౌనంగా కనిపించినట్టు సహచర సిబ్బంది సమాచారం ఇచ్చారు.

అయితే, ఈ మానసికఒత్తిడి పనిభారంతో మాత్రం కాదన్నది విచారణలో వెలుగు చూసింది. ఇక, తన సామాజిక మాధ్యమంలో చివరగా ఓ వీడియోను పోస్టు చేసి ఉండడం వెలుగు చూసింది. ఇందులో ఈ ప్రపంచం ఓ మాయ.. కోల్పోయేందుకు ఏమీ లేదన్న ఆధ్యాత్మిక వచనాలు చేసి ఉండడం గమనార్హం. అలాగే, విజయకుమార్‌ సతీమణి గీతావాణిని కమిషనర్‌ బాలకృష్ణన్‌ విచారించి, వివరాలను సేకరించారు. రెండేళ్లుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, వైద్యుల వద్ద చికిత్స కూడా తీసుకుంటూ, కౌన్సెలింగ్‌కు వెళ్తున్నారని ఆయన భద్రతా సిబ్బంది పేర్కొంటున్నారు.

అయితే, విజయకుమార్‌ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీసిన ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇదే అంశాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తూ సమగ్ర విచారణ జరగాలని పట్టుబట్టారు. ఏడీజీపీ అరుణ్‌ మీడియాతో మాట్లాడుతూ విజయకుమార్‌ పనిభారంతో బలన్మరణానికి పాల్పడ లేదని, మానసిక ఒత్తిడికి లోనయ్యారని, దీనిని రాజకీయం చేయొద్దని అని విజ్ఞప్తి చేశారు.

 అంత్యక్రియలు..
విజయకుమార్‌ బలన్మరణ సమాచారంతో రాష్ట్ర గవర్నరన్‌ ఆర్‌ఎన్‌ రవి, సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆయన భౌతికకాయాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలం తేని జిల్లా బోడినాయకనూరు సమీపంలోని అనైకారపట్టి గ్రామానికి తీసుకెళ్లారు. మంత్రి ఐ పెరియస్వామి, డీజీపీ శంకర్‌ జివ్వాల్‌తో పాటు పోలీసు బాసులు, అధికారులు నివాళులర్పించారు. విజయకుమార్‌ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన భౌతికకాయాన్ని డీజీపీతో సహా పోలీసు అధికారులు మోశారు. విజయకుమార్‌ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

టీఎన్‌పీఎస్సీ టూ యూపీఎస్సీ..
తేని జిల్లా బోడి నాయకనూరు సమీపంలోని అనైకారపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్‌ వీఏఓ చెల్లయ్య, రిటైర్డ్‌ టీచర్‌ రాజాత్తిల కుమారుడు విజయకుమార్‌. 2003లో టీఎన్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌–1 ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పదవి దక్కించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వివాహం జరిగింది. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్ష రాసి కలను సాకారం చేసుకున్నారు. 2009 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారిగా తమిళనాడులోని కడలూరు, కాంచీపురం, తిరువారూర్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో నిజాయితీతో పాటు సహచర, కింది స్థాయి సిబ్బందితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చైన్నె అన్నానగర్‌ డీసీపీగా కూడా పనిచేశారు. ఇటీవలనే డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన కోయంబత్తూరుకు వెళ్లారు. తన కుమార్తెను కూడా ఐపీఎస్‌ చేయాలన్న కాంక్షతో ఉన్న విజయకుమార్‌ను మానసికఒత్తిడి బలి కొనడం సహచరులు జీర్ణించుకోలేకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement