ఫిబ్రవరి 1 నుంచి నియోజకవర్గ బాట
సాక్షి, చైన్నె: ప్రజలలోకి చొచ్చుకెళ్లే విధంగా నియోజకవర్గ బాటకు డీఎంకే సన్నద్దమైంది. ముఖ్య నేతలు ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆయా నియోజకవర్గాలలో తిష్ట వేసి రోజుకో ప్రాంతంలో సభలను నిర్వహించనున్నారు. ఇందుకోసం స్టార్ వ్యాఖ్యతలు సన్నద్దమయ్యారు. మళ్లీ అధికారంలో లక్ష్యంగా సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వ తథ్యమన్న ధీమాను అన్ని వేదికలలో స్పష్టం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో పార్టీ తరపున ప్రజలలో చొచ్చుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. ఇప్పటికే బూత్‌ల స్థాయిలో ఇంటింటా ప్రచార పయనంలో కేడర్ నిమగ్నమై ఉన్నారు. జిల్లా స్థాయిలో సభలు, డివిజన్ల స్థాయిలో మహానాడులు విస్తృతం చేశారు. ఇక, ఫిబ్రవరి 1వ తేది నంంచి నియోజకవర్గ బాటకు సన్నద్దమయ్యారు. ఆయా నియోజక వర్గాలలలోని నేతల ద్వారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా, స్థానికంగా ఆయానియోజకవర్గాలకు చేసిన ప్రగతి, రాష్ట్రవ్యాప్తం సంక్షేమాల గురించి ఈ సభలో ప్రసంగాలు హోరెత్తించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్టార్ వ్యాఖ్యాతలను సిద్ధంచేశారు. యువకులైన వారిని ఎంపిక చేశారు. స్పష్టమైన గళం, స్థానిక అవగాహన, సమయానుగుణంగా వ్యాఖ్యల తూటాలను పేల్చే రీతిలో ఈ స్టార్ వ్యాఖ్యతలను ప్రత్యేక శిక్షణతో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉన్నారు. జిల్లాల కార్యదర్శులు, ఇ న్‌చార్జ్‌లు, నియోజకవవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల, డివిజన్ ప్రతినిధులు ఇక నియోజక వర్గాలలోనే ఉండే విధంగా డీఎంకే అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.


