క్లుప్తంగా
ఐఐటీలో గ్రామీణ టీచర్లకు
ఏఐ శిక్షణ
సాక్షి,చైన్నె : ఐఐటీ మద్రాసు ప్రవర్తక్, విద్యామంత్రిత్వ శాఖ స్వయం ప్లస్ నేతృత్వంలో ఉచిత ఏఐ శిక్షణకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ శిక్షక్షణ ఇవ్వనున్నట్టు మంగళవారం ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్– కే 12 టీచర్స్ కోసం దరఖాస్తుల చేసుకునేందుకు వీలు కల్పించామని, ఈనెలాఖరులోపు దరఖాస్తులను తమ వెబ్‌సైట్ ఐఐటీఎం ప్రవర్తక్‌లో నమోదు చేసుకోవచ్చని ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ నాలెడ్జ్ ఆఫీసర్ బాల మురళి శంకర్ తెలిపారు. ఏఐ విద్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆధునిక బోధన, మూల్యాంకనం, విద్యార్థులకు సమగ్ర ఏఐ సాధనాలతో 1 నుంచి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 40 గంటల శిక్షణ ఉచితమని ప్రకటించారు.
సీఎం ఇంటికి
బాంబు బెదిరింపు
–మాజీ సైనికుడు అరెస్టు
అన్నానగర్: ముఖ్యమంత్రి ఇంట బాంబు పెట్టినట్టు పోన్ చేసి కలకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సోమవారం ఒక కాల్ వచ్చింది. ఆళ్వార్ పేట సిద్ధరంజన్ రోడ్డులోని తమిళనాడు ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు ఉందని, కాసేపట్లో అది పేలిపోతుందని చెప్పి ఓ వ్యక్తి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కంట్రోల్ రూం తేనాంపేట పోలీసులకు సమాచారం చేరవేయడంతో, బాంబు నిపుణులు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. అయితే ఇదంతా ఉత్తుత్తి బెదిరింపు పనేని తేలడంతో దర్యాప్తుకు పూనుకున్నారు. విరుదునగర్‌కు చెందిన మాజీ సైనికుడు బాలమురుగన్ (43) మద్యం మత్తులో ఇలా బెదిరించినట్టు తేలింది. అతడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు.
ఈయూతో ఒప్పందం..
వస్త్ర ఎగుమతులకు ప్రోత్సాహం
కొరుక్కుపేట: యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య సుంకం రహిత వాణిజ్య ఒప్పందం కుదరడంపై తిరుప్పూర్ వస్త్ర ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు కె.ఎం. సుబ్రమణియన్ హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ 10 లక్షల మందికి పైగా జీవనోపాధిని అందిస్తుందని, వారిలో దాదాపు 70 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. భారతదేశం ఉపాధి ఆధారిత ఎగుమతి వృద్ధికి తిరుప్పూర్ వెన్నెముకగా ఉద్భవించింది. దీనికి 2,500 నమోదిత దిగుమతిదారులు ఉన్నారని, 20,000 కంటే ఎక్కువ అనుబంధ సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ. 45 వేల కోట్లు ఎగుమతి ఆదాయం చేరుకుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల పరిశ్రమగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్‌తో భారత్ సుంకాల ఒప్పందం చేసుకోవడంతో వస్త్రవ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.
చేపలవేటకు వెళ్లి శవమయ్యాడు!
తిరువళ్లూరు: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. వివరాలు..తిరువళ్లూరు జిల్లా గూడపాక్కం గ్రామానికి చెందిన పెయింటర్ గౌరీ శంకర్(29) తన భార్యాపిల్లలు బంధువుల ఇంటికి వెళ్లిన నేపథ్యంలో స్నేహితులతో కలిసి చేపలవేటకు వెళ్లాడు. అయితే చెరువులో దిగిన గౌరీశంకర్ ఎంతసేపటికీ బయటకు రావడంతో అనుమానించిన స్నేహితుడు అతడి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు నాలుగు గంటలు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంటలు రేగి కారు దగ్ధం
అన్నానగర్: కారులో మంటలు రేగి అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం రాత్రి సేలంలో రోడ్డు మీద చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అదష్టవశాత్తు సురక్షితంగా బైటపడ్డారు. వివరాలు.. సేలం సమీపాన సిద్ధనూర్ భువనేశ్వరి ప్రాంతంలో నివసించే శక్తి అనిష్ (32) సోమవారం సాయంత్రం తన భార్య కీర్తన, కూతురు ఎస్నా, తల్లి కమల, సోదరి మోనికాను వెంటబెట్టుకుని కారులో సేలం 5వ రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ కు వచ్చాడు. వారు అక్కడ కొన్ని వస్తువులు కొనుగోలు చేసి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు ఇంజిన్ నుంచి పొగలు వస్తూండడంతో అప్రమత్తమైన శక్తి అనిష్ కారు ఆపి తన కుటుంబ సభ్యులతో పాటు కారు దిగేశారు. ఆ తర్వాత కారు నుంచి మంటలు రేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఇంజిన్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.


