అంగరంగ వైభవంగా తిరుమలలో రథ సప్తమి వేడుకలు
తిరుమల: రథ సప్తమి వేడుకలను తిరుమలలో అన్ని శాఖల సమష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. మంగళవారం ఆయన ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలను వీక్షించినట్లు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి, పోలీసులకు, అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. ఏఈవో మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా వాట్సాప్, ఐవీఆర్‌ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించామని, వారందరూ టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.


