పరిస్థితుల కారణంగానే ఎన్‌డీఏలోకి టీటీవీ
– సెంగొట్టయ్యన్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె: కొన్ని పరిస్థితుల కారణంగానే ఎన్‌డీఏలోకి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ చేరినట్టు టీవీకే సమన్వయ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్ వ్యాఖ్యానించారు. టీవీకేలో దోస్తీ దిశగా తొలుత దినకరన్ ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే హఠాత్తుగా మళ్లీ ఎన్‌డీఏలోకి చేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచనతోనే తాను అన్నాడీఎంకే – బీజేపీ కూటమిలో చేరినట్టు దినకరన్ ప్రకటించుకున్నారు. అయితే, ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా, బలవంతంగా బీజేపీ దారిలోకి తెచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులలో మంగళవారం సెంగొట్టయ్యన్ మీడియాతో మాట్లాడుతూ, వాస్తవానికి టీవీకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు దినకరన్ సన్నద్ధమయ్యారని పేర్కొన్నారు. టీవీకే ను గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీలకు లేదన్నారు. ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి టీటీవీ తమ వైపుగా మొగ్గు చూపుతూ వచ్చారని, అయితే పరిస్థితుల కారణంగా ఆయన ఎన్‌డీఏ వైపుగా మళ్లీ దృష్టి పెట్టారన్నారు. టీవీకేతో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారంతో ఢిల్లీ పెద్దలు ఆయన్ను పిలిపించుకుని దారికి తెచ్చుకున్నట్టుందని మండి పడ్డారు. కాగా, సెంగొట్టయ్యన్ వ్యాఖ్యలపై దినకరన్ స్పందిస్తూ ఆయన ఎవరు? అని ప్రశ్నించడం గమనార్హం.
మూత్రపిండాల మార్పిడి
చికిత్సలో కొత్త బెంచ్ మార్క్
సాక్షి, చైన్నె: రెండేళ్లలో 9 మూత్ర పిండ మార్పిడి శస్త్ర చికిత్సలో కొత్త బెంచ్ మార్క్‌ను నమోదు చేశామని జెమ్ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సెంథిల్ నాథన్, నెఫ్రాలజిస్టు డాక్టర్ బాల ముకుందన్ తెలిపారు. మూత్ర పిండ మార్పిడితో కొత్త జీవితాలను పొందిన వారు ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. మంగళవారం ఈ శస్త్ర చికిత్సల గురించి వారు వివరించారు. రోగ నిరోధక శక్తి కారణంగా ఏబీఓఐ మార్పిడి అత్యంత సంక్లిష్టమైన మూత్ర పిండ ప్రక్రియలో ఒకటి అని తెలిపారు. దాత, గ్రహీత మధ్య అసమతుల్యత, తీవ్రమైన డీసెన్సిటైజేషన్ , ముందస్తు రోగ నిరోధక శక్తి తగ్గడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో ఉన్న వారికి ఈ శస్త్ర చికిత్స 100 శాతం విజయవంతమైనట్టు పేర్కొన్నారు. మూత్ర పిడ మార్పిడి గ్రహీతలు తిరువణ్ణామలై , దిండివనం, మేల్ మలయనూరు, చైన్నె, పట్టుకోట్టై తదితర ప్రాంత వాసులు తమ ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్టు తెలియజేశారు.
సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి
–మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం
అన్నానగర్: సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతై మరణించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా, తాలూకాలోని మాపిళ్లైయురాని గ్రామానికి చెందిన వనరాజన్ కుమారుడు తిరుమణి (13), ఆర్ముగం కుమారుడు నరేన్ శ్రీ కార్తీక్ (12), కదిరేశన్ కుమారుడు ముఖేంద్రన్ (12) సోమవారం సాయంత్రం తమ గ్రామ సమీపంలోని సిలువైపట్టి మొట్టై గోపురం బీచ్ ప్రాంతంలో సముద్ర స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి మృతి చెందారు. ఇది తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం ఎంకె స్టాలిన్ దీనిపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సీఎం సహాయనిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు.


