
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జూలై తొమ్మిదిలోగా ఖరారయ్యే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలకు సంబంధించి నిర్దేశించిన గడువుకు ప్రధాని మోదీ సాత్వికంగా తలొగ్గుతారని రాహుల్ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్‌లో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే, దానిని ఖరారు చేసేందుకు భారత్ తొందరపడదంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన ప్రకటనను రాహుల్ గుర్తుచేశారు. పీయూష్ గోయల్ ఈ విధమైన ప్రకటన చేసినప్పటికీ, ప్రధాని మోదీ అమెరికా విధించిన సుంకాల గడువుకు మృదువుగా తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు.
Piyush Goyal can beat his chest all he wants, mark my words, Modi will meekly bow to the Trump tariff deadline. pic.twitter.com/t2HM42KrSi
— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2025
ప్రతిపాదిత తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై భారత్- అమెరికన్ అధికారుల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. ట్రంప్ యంత్రాంగం విధించిన పరస్పర సుంకాలపై 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. అప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరని పక్షంలో.. అమెరికన్ వస్తువులపై భారత సుంకాలకు ప్రతిగా ట్రంప్ విధించిన మునుపటి అమెరికా సుంకాలు తిరిగి అమలయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ యంత్రాంగం భారత ఎగుమతుల శ్రేణిపై 26 శాతం సుంకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలు ప్రారంభించిన దరిమిలా ఈ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు.
న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ పరస్పరం ప్రయోజనకరమైన, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రమే సంతకం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇది విన్-విన్ ఒప్పందంగా ఉండాలని, జాతీయ ప్రయోజనం ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అమెరికాతో సరైన ఒప్పందం ఏర్పడితే, అభివృద్ధి చెందిన ఆ దేశంతో భారత్ సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం