
బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టిన ప్రబుద్ధులు
జైపూర్: రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిండుగా తొణికిసలాడుతున్న భరత్‌పూర్ జిల్లాలోని బంధ్ బరైతా రిజర్వాయర్‌పై ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై భయపడుతున్న తన కూతురిని బలవంతంగా అతడు కూర్చోబెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఈ నెల 4న ఉమా శంకర్ తన భార్య, కుమార్తెతో జలాశయం వద్దకు వెళ్లాడు. వీడియో చిత్రీకరించేందుకు గాను ప్రమాదకరంగా ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై తీవ్రంగా భయపడుతున్న తన కుమార్తెను గద్దించి కూర్చోబెట్టాడు. అక్కడ ఆమె కిందపడకుండా పట్టుకునేందుకు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాటూ లేకపోవడం గమనార్హం. ఆ రిజర్వాయర్ ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది.
ఇటీవల వర్షాలకు జలకళ సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉమా శంకర్ తీసి, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం కూతురు పట్ల ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని నిలదీశారు. దీంతో, ఉమా శంకర్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడు. పోలీసులు దీనిపై ఇంకా స్పందించలేదు.