
ఎవరికీ బీపీ తెప్పించకండి.. షుగర్ స్థాయిలు పెంచకండి
కోర్టుల్లో కోపం ప్రదర్శించే జడ్జీలకు సీజేఐ గవాయ్ సూచన
బాంబే హైకోర్టు లైవ్–స్ట్రీమింగ్ ప్రారంభోత్సవంలో ప్రసంగం
ముంబై: న్యాయస్థానాల్లో వాడీవేడీగా వాదనలు జరుగుతుంటే సంయమనంతో ఉండాల్సిన న్యాయమూర్తులు సైతం పట్టరాని ఆవేశంతో లాయర్లపై విరుచుకుపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆవేశాలు కోర్టుల్లో ప్రశాంత పనివాతావరణాన్ని పాడుచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో బాంబే హైకోర్టులో కేసుల వాదోపవాదనల ప్రత్యక్ష ప్రసారాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని సీజేఐ గవాయ్ ప్రారంభించి తర్వాత ప్రసంగించారు.
‘‘బాంబే హైకోర్టులో న్యాయమూర్తులు వెలువర్చిన ఎన్నో తీర్పులను చూసి గర్వపడ్డా. తీర్పులను చాలా చక్కగా రాశారు. అయితే ఈ హైకోర్టు జడ్జీలపై కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొందరు న్యాయమూర్తులు కోపాన్ని నియంత్రించుకోలేక కోర్టుల్లోనే తిట్టేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. న్యాయమూర్తిగా పనిచేయడం అనేది మిగతా ఉద్యోగాల మాదిరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పనిచేసేది కాదు. సమాజం, దేశం కోసం చేసే అత్యుత్తమమైన సేవల్లో ఇదీ ఒకటి.
ఇందుకు అంకితభావం, నిబద్ధత చాలా అవసరం. అయితే కొందరు జడ్జీలు తరచూ లాయర్లతో మర్యాదలేకుండా, పరుష పదజాలం ఉపయోగిస్తూ తిడుతున్నట్లు కనిపిస్తోంది. తరచూ లాయర్లకు, కొందరు ఉన్నతాధికారులకు సమన్లు జారీచేస్తున్నారు. అనవసరంగా సమన్లు జారీచేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. జడ్జీలు ప్రశాంతంగా ఉంటే కోర్టుహాల్‌లో వాతావరణం హుందాగా ఉంటుంది. అలాంటప్పుడే లాయర్లుసహా అక్కడ ఉండేవాళ్లందరి రక్తపోటు, చక్కర స్థాయిలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ఇది న్యాయమూర్తులకూ వర్తిస్తుంది’’అని అనగానే అక్కడ ఉన్నవా
రంతా ఫక్కున నవ్వారు.
పార్ట్‌టైమ్ జడ్జీల్లా తయారయ్యారు
‘‘కొందరు జడ్జీలు రోజువారీ విధులను సంపూర్ణంగా చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి పార్ట్‌టైమ్ జడ్జీలతో సమస్యే. కొన్ని ధర్మాసనాల్లో కొందరు జడ్జీల వైఖరిపై నాకు పక్కా సమాచారం అందింది. పేర్లు వెల్లడించనుగానీ వాళ్లు కోర్టు మొదటి సెషన్‌లో కొద్దిసేపు, తర్వాతి సెషన్‌లో కొద్దిసేపు అలా ధర్మాసనంపై కూర్చుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి పార్ట్‌టైమ్ జడ్జీల వైఖరి మంచిది కాదు. సమాజానికి, దేశానికి సేవచేస్తామని జడ్జీగా ప్రమాణంచేశాక ఇలాంటి ధోరణి ప్రదర్శించడం ఆ ప్రమాణాన్ని చిన్నచూపు చూడటమే అవుతుంది. ఇలాంటి చర్యలతో న్యాయస్థానాలకు చెడ్డపేరు తీసుకురావొద్దు. ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, లాయర్లు అంకితభావం, కృషితో సమున్నత స్థాయికి చేరిన న్యాయస్థానాల ఘనకీర్తికి మచ్చ తీసుకురాకండి’’అని హితవు పలికారు.
కాలానుగుణంగా చట్టాలను అన్వయించుకోవాలి
విస్తృతస్థాయిలో రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంట్‌కు ఉందంటూ ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై సీజేఐ మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలో సమూలస్థాయిలో మార్పులు చేయాలన్న వాదనలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి రాజ్యాంగం అనేది సజీవ పత్రం. మారుతున్న కాలానుగుణంగా, సమాజ అవసరాలకు తగ్గట్లుగా పార్లమెంట్ రాజ్యాంగంలో మార్పులు చేయొచ్చు. సామాజిక, ఆర్థికాభివృద్దికి బాటలువేసేలా ఆ మార్పులు ఉండాలి.
చట్టాలు, రాజ్యాంగాన్ని నేటి సమాజ సవాళ్లకు పరిష్కారాలు వెతికేందుకు అనువుగా మాత్రమే అన్వయించుకోవాలి. సమాజ అవసరాలు తీర్చేలా న్యాయవితరణలో న్యాయస్థానాలు చట్టాలు, రాజ్యాంగాన్ని ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి’’అని సీజేఐ అన్నారు. ‘‘జడ్జీ పోస్ట్‌లోకి సిఫార్సుచేసేముందుగా ఆయా అభ్యర్థులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే కొత్త సంస్కృతికి సుప్రీంకోర్టు తెరలేపింది. అయితే ఒక హైకోర్టులో అభ్యర్థులే ముందుగా చొరవతీసుకుని జడ్జీలను కలిసే ప్రయత్నంచేసినట్లు నాకు తెలిసింది. ఇలాంటి అనుచిత ధోరణి బాంబే హైకోర్టులో ఉండబోదనే ఆశిస్తున్నా’’అని ఆయన అన్నారు.