
తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చ
దిబ్రుగఢ్: జీవవైవిధ్యానికి నెలవైన బ్రహ్మపుత్ర నదీజలాల్లో మరో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చతో ఉన్న ఈ చిన్న చేపకు శాస్త్రవేత్తలు వెంటనే పేథియా దిబ్రూఘర్నేసిస్ అనే పేరుపెట్టేశారు. ఈశాన్య భారతంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీజలాల్లో ఈ నూతన మత్స్యజాతిని గుర్తించారు. దిబ్రూగఢ్ సమీప జలాల్లో ఈ మంచినీటి చేపను కనుగొన్నారు.
అందుకే దిబ్రూగఢ్ పేరు ధ్వనించేలా పేథియా దిబ్రూఘర్నేసిస్ అని పేరుపెట్టారు. ఈ మత్స్యం నెత్తల్లు వంటి చిన్నచేపలుండే సైప్రినిడ్ జాతికి చెందినదిగా వర్గీకరించారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంట ఉన్న భిన్నజాతుల చేపలు, వాటి సంతతి, వృద్ధి, ఇతర రకాల జలచరాల వివరాలను తెల్సుకునేందుకు సర్వే చేపట్టగా ఆ క్రమంలో అధ్యయనకారులకు ఈ చేప కంటబడింది. మిగతా చేపలతో పోలిస్తే కొత్తరకం చేప కాస్తంత భిన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎన్నెన్నో ప్రత్యేకతలు
తాను ఈదుతున్న నీటిలో ఏదైనా షార్క్, డాలి్ఫన్, ఆక్టోపస్ వంటి శత్రుజలచరాలు కదిలితే నీటి తరంగాలతో వాటి కదలికలను కనిపెట్టి అప్రమత్తం చేసే జ్ఞానేంద్రియ రేఖ(లేటరల్ లైన్) ఈ చేపలో అసంపూర్ణంగా అభివృద్ధి చెందింది. ఈ కారణంగా దీనిని ఇతర జీవులు వేటాడటం సులభం అవుతుంది. ఇది పెద్దగా కష్టపడకుండానే వాటి నోటికి చిక్కుతుంది. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చ దీని ప్రత్యేకత.
తోక చుట్టూతా 10 పొలుసులు భిన్నంగా ఉన్నాయి. అదీకాకుండా పై భాగంలోని రెక్కకు, లేటరల్ లైన్‌కు మధ్యలో నాలుగు పొలుసుల వరసలు, అదే విధంగా కింది రెక్కకు, లేటరల్ లైన్‌కు మధ్యలో మరో నాలుగు పొలుసుల వరసలు ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. ‘‘పిల్లి మీసాల్లాగా చేప నోటి వద్ద ఉండే నిర్మాణం ఈ జాతి చేపకు లేదు. చేప కన్ను తర్వాత వెనక్కివెళ్లే కొద్దీ తొలుత కనిపించే ప్రాంతంలో దీనికంటూ ప్రత్యేకంగా ఎలాంటి మచ్చలు, రంగులు లేవు.
కానీ తోక సమీపంలో విచిత్రంగా నల్లని, పొడవాటి మచ్చ ఉంది. ఈ జాతిచేపలన్నింటిలో ఈ మచ్చ ఉంది. బ్రహ్మపుత్ర జలాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలని ఈ చేప మరోసారి నిరూపించింది’’ అని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ‘‘ నదీ ప్రవాహం వెంట చిత్తడి నేలల పరిరక్షణ, మితిమీరిన చేపల వేటను తగ్గించడం వంటి చర్యలతో ఇలాంటి అరుదైన చిన్న కొత్త చేపలను పరిరక్షించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి’’ అని అధ్యయనకారులు సూచించారు.