వేసవి సెలవుల పొడిగింపు | Sakshi
Sakshi News home page

వేసవి సెలవుల పొడిగింపు

Published Tue, Jun 6 2023 9:22 AM

పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు (ఫైల్‌) - Sakshi

సాక్షి, చైన్నె: గత విద్యా సంవత్సరం చివరిలో పబ్లిక్‌ పరీక్షలు ముగిసినానంతరం రాష్ట్రంలో ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మేరకు జూన్‌ 1వ తేదీ 8 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, ఎండల ప్రభావం ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, వేసవి సెలవులను జూన్‌ 7వ తేదీ వరకు పొడిగించారు. అయితే, అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్రంలో ఖాతరు చేయలేదు.

ముందుగా నిర్ణయించినట్టుగా జూన్‌ ఒకటో తేదీనే పాఠశాలలను రీ ఓపెన్‌ చేశారు. ఈ సమాచారంతో విద్యాశాఖ అధికారుల ఆగ్రహానికి ప్రైవేటు పాఠశాలలు గురి కావాల్సి వచ్చింది. చివరకు పాఠశాలల పునఃప్రారంభించాల్సిన తేదీ జూన్‌ 7 అని తెలియజేసే బోర్డులు అన్ని పాఠశాలల ముందూ ప్రత్యక్షమయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఎండ వేడిమి ఏమాత్రం తగ్గలేదు. అనేక జిల్లాలో ఆదివారం, సోమవారం 108 ఫారిన్‌ హిట్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాఠశాలల ప్రారంభ తేదీని మార్చాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది.

విద్యార్థులు క్షేమం కోసం..
నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంత వరకు రాష్ట్రంలో అనేక జిల్లాలో ఎండ వేడమి అధికంగానే ఉంటుందని వివరించారు. దీంతో విద్యా శాఖమంత్రి అన్బిల్‌ మహేశ్‌ నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం ఉదయం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎండల ప్రభావం గురించి వివరించారు. పాఠశాలలను ఇప్పుడు తెరిచిన పక్షంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని, సెలవులను పొడిగించాలని సీఎంను కోరారు. సీఎం స్టాలిన్‌ ఆమోదించడంతో మరో వారం పాటు సెలవులను పొడిగిస్తూ విద్యా శాఖ మంత్రి అన్భిల్‌ మహేశ్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

ఆ మేరకు 6 నుంచి 12వ తరగతికి ఈనెల 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అలాగే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈనెల 14వ తేదీన పాఠశాలలు తెరుస్తారు. 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐఏఎస్‌ అధికారి గజలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధం చేసింది. ఇక, ప్రేవేటు విద్యాసంస్థలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ముందుగానే పాఠశాలలను రీ ఓపెనింగ్‌ చేసిన పక్షంలో ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చిన పక్షంలో సీజ్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులు ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే వేసవి సెలవులు వారం రోజులు పొడిగించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలోనూ సెలవులు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈనెల 14వ తేదీ 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరచుకోనున్నాయి. కాగా, ఓ వైపు సెలవులు పొడిగించారో లేదో మరోవైపు చైన్నె, శివారు జిల్లాలో సాయంత్రం వాతావరణం పూర్తిగా మారింది. ఉరుములు మెరుపులతో సోమవారం కాసేపు వర్షం పడడం గమనార్హం. అలాగే, అరుప్పు కోట్టైలో వడగళ్ల వాన పడింది. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

అనుకున్నదే అయ్యింది.. సూర్యప్రతాపం కారణంగా వేసవి సెలవులను మరో వారం పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ముందస్తుగా పాఠశాలలను తెరిచినా, ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను వేధించినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
Advertisement