క్లుప్తంగా

ఏర్పాటు చేసిన ధరల పట్టిక  - Sakshi

టాస్మాక్‌లో

ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు

వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టాస్మాక్‌ దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధికంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బీర్‌తోపాటు మద్యం బాటిళ్లపైనా రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పెన్నాతూరులోని టాస్మాక్‌ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తున్నట్లు బోర్డును ఏర్పాటు చేశారు.

భార్యను హత్య చేసిన

భర్త అరెస్ట్‌

తిరువొత్తియూరు: కోవై జిల్లాలో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. కోవై సెల్వపురానికి చెందిన కరుప్పుస్వామి కుమార్తె రమణి (20), కోవై పేరూరులో ఉన్న కళాశాలలో బీకాం రెండవ సంవత్సరం చదువుతుండగా అదే కళాశాలలో చదువుతున్న కోవై మత్తువ రాయపురం కురింజినగర్‌కు చెందిన సంజయ్‌ (20) ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఏమైందోకాని రమణి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోస్టుమార్టం రిపోర్టులో రమణి హత్యకు గురైనట్టు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంజయ్‌ను విచారణ చేపట్టారు. అతను రమణిని చున్నీతో గొంతు బిగించి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. సంజయ్‌ను, హత్యను దాచిపెట్టిన అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.

మపోసీ రోడ్డును

ముంచెత్తిన మురుగునీరు

తిరుత్తణి: తిరుత్తణి మపోసీ రోడ్డులో మురుగునీరు పేరుకుపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుత్తణి పట్టణంలో నిత్యం రద్దీగా వుండే మపోసీ రోడ్డులోని డ్రైనేజీ నుంచి బుధవారం రాత్రి మురుగునీరు పైకి వచ్చింది. గుంటను తలపించేలా నీరు నిలిచిపోయింది. దుర్గంధం వెదజల్లుతుండడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

బస్సు ఢీకొని

యువకుడు మృతి

అన్నానగర్‌: నైల్లెలోని రైల్వే ఫ్లైఓవర్‌పై గురువారం వేకువజామున ప్రభుత్వ బస్సు, కారును ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. నైల్లె జిల్లాలోని వల్లియూర్‌ నుంచి గురువారం కోవిల్‌పట్టికి ప్రభుత్వ బస్సు బయలుదేరింది. తచ్చనల్లూరు నార్త్‌ బైపాస్‌ రోడ్డులోని వన్నార్‌పేట మీదుగా బస్సు వెళుతుండగా రైల్వే ఫ్లై ఓవర్‌ ప్రాంతం వద్ద బస్సు–కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఖైదీ పరార్‌..

పట్టుకున్న పోలీసులు

వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని శెట్టియపాళ్యం గ్రామంలో ఓ యువకుడు సారా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గుడియాత్తం ఎకై ్సజ్‌ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. శెట్టియంకుప్పం గ్రామానికి చెందిన సూర్య(21) సారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతన్ని కాట్పాడి కోర్టులో హాజరు పరిచి గుడియాత్తం జైలుకు తరలిస్తుండగా సూర్య పరారయ్యాడు. గురువారం మధ్యాహ్నం గుడియాత్తం సమీపంలోని లింగుండ్రం కాలువ వద్ద ఉన్న గుడిసెలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి సూర్యను అరెస్ట్‌ చేశారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 80,284 మంది స్వామివారిని దర్శించుకోగా.. 34,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైం స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top