నా కూతురినే పెళ్లి చేసుకుంటావా.. నీకు ఎంత ధైర్యం

Honor killing In Krishnagiri - Sakshi

తమిళనాడు: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని కత్తులతో నరికి హత్య చేసిన సంఘటన కృష్ణగిరిలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి సమీపంలో వున్న కిడామ్‌పట్టికి చెందిన చిన్నయ్యన్‌ కుమారుడు జగన్‌ (28) టైల్స్‌ అతికించే పనిచేస్తుంటాడు. ఇతను కృష్ణగిరి జిల్లా ములంగళ్‌కు చెందిన శంకరన్‌ కుమార్తె శరణ్య (21)ను ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారి ప్రేమను ఒప్పుకోలేదు. ఆమెకు మరొక యువకుడితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

ఈ క్రమంలో జగన్‌, శరణ్య ఒక క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో శరణ్య కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జగన్‌ మోటారు సైకిల్‌పై ధర్మపురి, కృష్ణగిరి రోడ్డులో వెళుతుండగా శరణ్య తండ్రి శంకరన్‌, తన బంధువుతో కలిసి అతన్ని అడ్డగించారు. కత్తులతో దాడి చేశారు. జగన్‌ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కావేరి పట్టణం పోలీసులు అక్కడికి చేరుకుని జగన్‌ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. యువకుడి తల్లిదండ్రులు లీసులను అడ్డుకుని న్యాయం చేయాలని ఆందోళన చేశారు.

ఎస్పీ సరోజ్‌కుమార్‌ ఠాగూర్‌, సహాయ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ తమిళరసి అక్కడికి చేరుకుని హంతకులను త్వరలోనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత మృతదేహాన్ని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్‌ మామ శంకరన్‌, బంధువులు అరులు, గోవిందరాజు, తిమ్మరాయ కోసం గాలింపు చర్యలు చేపట్టగా శంకరన్‌ మంగళవారం రాత్రి కృష్ణగిరి అదనపు మహిళా పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.

మరిన్ని వార్తలు :

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top