భానుపురి (సూర్యాపేట) : కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పధకంపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉందని, ఈనెల 19 నుంచి వచ్చే నెల 20 వరకు ఆన్‌లైన్ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, జెడ్పీసీఈఓ శిరీష, సీపీఓ కిషన్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.
జలసిరి పనులు
వేగవంతం చేయాలి
అర్వపల్లి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో నీటి సంరక్షణకు జలసిరి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు డీఆర్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం అర్వపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వీబీజీ రామ్‌జీ పనులపై ఆశాఖ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వీబీజీ రామ్‌జీ పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,278 పనులు జరుగుతున్నాయని, 17,600మంది కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ ఇరుగు నాగయ్య, టీఏలు యాదమ్మ, దీపిక, నాగమణి, సీఓ సుధీర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేటకు రైలు మార్గం కావాలని పోస్టుకార్డులు
సూర్యాపేట : సూర్యాపేటకు రైలు రావాలని కోరుతూ లక్ష పోస్టు కార్డులను ప్రధానమంత్రికి పంపించాలనే సంకల్పంతో సూర్యాపేటలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమవారం సాధన సమితి సభ్యులు పోస్టుబాక్సులో పోస్టుకార్డులు వేశారు. ప్రధానమంత్రి సూర్యాపేటకు రైలు మార్గాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కో కన్వీనర్ రాచూరి ప్రతాప్, నాగవల్లి కరుణాకర్, జమాలుద్దీన్, సరిత, రషీద్, రాము, సంగీత, అక్షిత పాల్గొన్నారు.
లక్ష్మీనారసింహుడికి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని సోమవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, నవీన్‌కుమారాచార్యులు, దుర్గాప్రసాద్‌వర్మ, భక్తులు పాల్గొన్నారు.


