ముఖం చూపిస్తేనే హాజరు | - | Sakshi
Sakshi News home page

ముఖం చూపిస్తేనే హాజరు

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

వారం రోజుల్లో పూర్తి స్థాయిలో హాజరు నమోదు

ఫ మండల పరిషత్‌ కార్యాలయాల్లో ‘మీ ప్రమాణం’ యాప్‌ ద్వారా

ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు

ఫ ఇప్పటికే జిల్లా పరిషత్‌ కార్యాలయంలో

అమలవుతున్న విధానం

ఫ సుమారు 300 మంది ఉద్యోగులకు వర్తింపు

ఫ మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో

అమలుకు రంగం సిద్ధం

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు విషయంలో పారదర్శకత పెంచడంతో పాటు విధులకు గైర్హాజరయ్యే వారికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సాంకేతికతను వినియోగించనుంది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ‘మీ ప్రమాణం’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్‌ ద్వారా ఉద్యోగులు తమ ముఖాన్ని స్కాన్‌ చేయించుకుని హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇతరుల తరఫున హాజరు వేయడం, కార్యాలయానికి రాకుండానే హాజరు నమోదైనట్లు చూపించడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.

విధులు నిర్వహిస్తున్న

300 మంది ఉద్యోగులు

జిల్లా పరిషత్‌ కార్యాలయంతో పాటు జిల్లాలోని 23 మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఆయా కార్యాలయాల్లో సుమారు 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని వర్తింపజేయనున్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు, యాప్‌ వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న హాజరు విధానానికి బదులుగా కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉద్యోగుల విధుల నిర్వహణపై మరింత పర్యవేక్షణకు అవకాశం ఏర్పడనుంది.

బాధ్యత పెరగనుందా

ప్రభుత్వ కార్యాలయాలకు సమయానికి చేరుకోవడం, నిర్ణీత పనివేళల వరకు విధుల్లో ఉండటం ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత. అయితే కొన్నిచోట్ల హాజరు నమోదులో పారదర్శకతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ గుర్తింపు హాజరు విధానం అమల్లోకి వస్తే ఉద్యోగుల హాజరుపై పూర్తి స్పష్టత రానుంది. విధులకు సక్రమంగా హాజరయ్యే వారితో పాటు గైర్హాజరయ్యే వారి వివరాలను కూడా పర్యవేక్షించడం సులభతరం కానుంది. జిల్లాలో ఈ విధానం ఇప్పటికే జెడ్పీ కార్యాలయంలో అమలవుతుండగా, మరో వారం పది రోజుల్లో మండల పరిషత్‌ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో అమలు కానుంది. ఇందుకోసం యాప్‌ వినియోగంపై ఉద్యోగులకు అవగాహన కల్పించనున్నారు.

ప్రస్తుతం ‘మీ ప్రమాణం’ యాప్‌ ద్వారా జెడ్పీ కార్యాలయంలో ముఖ గుర్తింపు హాజరు విధానం కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లోనూ పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాప్‌ వినియోగంపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నాం.

– శిరీష, జెడ్పీ సీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement