చివ్వెంల(సూర్యాపేట) : సైబర్ నేరగాళ్లతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె.భవ్య అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని న్యూ మిలినీయం పాఠశాలలో శుక్రవారం చట్టాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థి దవ నుంచే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి, భావిపౌరులుగా ఎదగాలన్నారు. విద్యార్థుల సెల్‌ఫోన్ వినియోగం పట్ల తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. అపరిచితులకు కాల్ చేయొవద్దన్నారు. అర్హులైన వారికి డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. గుడ్‌టచ్–బ్యాడ్ టచ్ గురించి ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాల సుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం
నూతనకల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక, యువజన వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా ఉద్యమిద్దామని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన పీవైఎల్ జిల్లా 9వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువకులను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. యువతను పాలకులు మద్యానికి, మత్తు పానీయాలకు బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. యువత శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్, జిల్లా అధ్యక్షులు నల్లగొండ నాగయ్య, కార్యదర్శి రవి, కునుకుంట్ల సైదులు, గంటా నాగయ్య, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి, వీరబోయిన రమేష్, బండి రవి, బ్రహ్మం, మున్నా అశోక్, అనంతరామయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు కృషి
సూర్యాపేట : భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల పరిరక్షణకు బీజేపీ కృషిచేస్తోందని ఆ పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ అన్నారు. సూర్యాపేటలోని ఆ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బొజ్జ పరశురాం అధ్యక్షతన జరిగిన ఆ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు సుభిక్షమైన పాలనను అందిస్తుందని చెప్పారు. అధికార మార్పిడికి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసే కుట్రలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు, ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ, రుద్రవరం లింగస్వామి, మీసాల మార్కండేయ, పిడతల శంకర్, చెందు, రాజు, సురేందర్, రోహిత్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.


